రోస్బర్గ్ కు హామిల్టన్ వార్నింగ్!
సావో పాలో:ఈ ఏడాది ఫార్ములావన్లో విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తికర పోరు సాగుతోంది. ఒకవైపు పాయింట్ల పరంగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ అగ్రస్థానంలో ఉంటే, మరొకవైపు సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుస విజయాలతో దుమ్ములేపుతున్నాడు. దాంతో ఈనెల 27న అబుదాబిలో జరిగే సీజన్ చివరి రేసు వరకూ ప్రపంచ చాంపియన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచిన హామిల్టన్ కు ఇది వరుసగా హ్యాట్రిక్ విజయం కావడంతో విశ్వవిజేత పోరు రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో రోస్ బర్గ్..కాచుకో అంటూ హామిల్టన్ వార్నింగ్ ఇచ్చాడు. 'నేను టైటిల్ వేటలోకి వచ్చేశా. ప్రపంచ చాంపియన్ సాధించడం కోసం నాశాయ శక్తులా ప్రయత్నిస్తా. ఐదు అంతకంటే ఎక్కువ సార్లు ప్రపంచ చాంపియన్గా నిలవాలనేది నా కల. ఈ పరిస్థితుల్లో ఎటువంటి తప్పిదాలు చేయదలుచుకోలేదు. విజయంపైనే గురి. నా జట్టు నాకు ఇచ్చిన కారు చాలా బాగుంది. అది ఒక నమ్మదగిన కారు ' అని హామిల్టన్ పేర్కొన్నాడు.
ఇప్పటి వరకూ 20 రేసులో జరగ్గా, అందులో రోస్ బర్గ్ 9 గెలిచాడు. అటు హామిల్టన్ కూడా తొమ్మిది విజయాల్నే సొంతం చేసుకున్నాడు. అయితే పాయింట్ల పరంగా రోస్ బర్గ్ కంటే హామిల్టన్ 12 పాయింట్లు వెనుకబడ్డాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 367 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, హామిల్టన్ 355 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.ఇక ఈ సీజన్ లో మిగిలింది అబుదాబి గ్రాండ్ ప్రి మాత్రమే. నవంబర్ 27వ తేదీన ఈ రేసు జరుగనుంది. ఇందులో హామిల్టన్ గెలిస్తే 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 18 పాయింట్లు, మూడో స్థానంలో నిలిస్తే 15పాయింట్లు, నాల్గో స్థానంలో నిలిస్తే 12 పాయింట్లు వస్తాయి. అంటే రోస్ బర్గ్ మూడో స్థానంలో నిలిచినా చాంపియన్ గా అవతరిస్తాడు.