నికో రోస్ బర్గ్ సంచలన నిర్ణయం
ఎలా సాధించామన్నది కాదు.. సాధించామా? లేదా? అన్నది ముఖ్యం. ఫార్ములావన్ డ్రైవర్ నికో రోస్ బర్గ్కు సరిపోయే డైలాగ్ ఇది. ప్రత్యర్థి నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా చివరి వరకూ పోరాటం సాగించటమనేది ఈ జర్మన్ డ్రైవర్ రోస్ బర్గ్ తెలిసిన విద్య. అదే అతన్ని ప్రపంచ చాంపియన్ చేసింది. ఈ ఏడాది ఫార్ములావన్ చాంపియన్లో కడవరకూ పోరాటం సాగించిన రోస్ బర్గ్.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిథ్య వహించిన రోస్ బర్గ్.. సహచర డ్రైవర్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ను సైతం పక్కకు నెట్టి చాంపియన్ గా అవతరించాడు. సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు ఫార్ములా వన్ టైటిల్స్ గెలిచి మంచి జోరు కనబరిచిన రోస్ బర్గ్.. చివరి నాలుగు రేసుల్లో రెండో స్థానంలో నిలిచి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు.
ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్ గా నిలవడమే తన కల అన్న రోస్ బర్గ్.. ఇక చాలంటూ ఆ గేమ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఐదు రోజుల క్రితం విశ్వవిజేతగా నిలిచిన రోస్ బర్గ్ ..ఇక ఆ గేమ్లో తాను సాధించాల్సింది ఏమీ లేదంటూ పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను చిన్నతనం నుంచి రేస్లోనే ఉన్నానని, ఒకటి మాత్రం తనను చాంపియన్ను చేసిందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. తాను ప్రపంచ చాంపియన్ గా నిలవడం వెనుక ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు ఉన్నాయన్నాడు. ఇక తన పర్వతాన్ని ఎక్కేసిన తరువాత సాధించడానికి ఏమీ మిగలని కారణంగానే వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించినట్లు రోస్ బర్గ్ తెలిపాడు.
గత నెల 27వ తేదీన జరిగిన సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్ మొత్తం 385 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినా... రోస్‌బర్గ్ టాప్-3లో నిలువడంతో ఈ బ్రిటన్ డ్రైవర్ ఓవరాల్‌గా 380 పాయిట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
నిరంతర కృషి
2006లో బెహ్రయిన్ గ్రాండ్ ప్రి ద్వారా అంతర్జాతీయ ఫార్ములావన్లోకి అడుగుపెట్టిన రోస్ బర్గ్ ప్రపంచ చాంపియన్ గా నిలవడానికి విపరీతంగా కష్టించాడనే చెప్పొచ్చు. తొలి గ్రాండ్ ప్రి టైటిల్ ను అందుకోవడానికి రోస్ బర్గ్ కు ఆరు సంవత్సారాలు పట్టింది. 2012లో చైనీస్ గ్రాండ్ ప్రిను అందుకోవడం ద్వారా తొలి టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్న రోస్ బర్గ్ తన జైత్రయాత్రకు పునాది వేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన జపానీస్ గ్రాండ్ ప్రి టైటిల్ అతని కెరీర్లో చివరి విజయం కాగా, అబుదాబి గ్రాండ్ ప్రి అతని ఆఖరి ఎంట్రీ. తన సుదీర్ఘ పోరాటంలో 23 టైటిల్స్ ను రోస్ బర్గ్ సొంతం చేసుకున్నాడు.ఇందులో పోల్ పొజిషన్ సాధించనవి 30 ఉండగా, ఫాస్టెస్ట్ ల్యాప్స్ 20 ఉన్నాయి. ఇదిలా ఉండగా, పోడియం పొజిషన్ సాధించినవి 57.