హామిల్టన్‌పైనే అందరి దృష్టి | Mercedes and Lewis Hamilton still hold the edge as F1 | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌పైనే అందరి దృష్టి

Published Sat, Mar 25 2017 2:00 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

హామిల్టన్‌పైనే అందరి దృష్టి - Sakshi

హామిల్టన్‌పైనే అందరి దృష్టి

నేటి నుంచి ఫార్ములావన్‌–2017 సీజన్‌

మెల్‌బోర్న్‌: గత ఏడాది సహచరుడు నికో రోస్‌బర్గ్‌ (మెర్సిడెస్‌)కు టైటిల్‌ సమర్పించుకున్న లూయిస్‌ హామిల్టన్‌ ఈ ఏడాది మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2017 ఫార్ములావన్‌ సీజన్‌కు శనివారం జరిగే తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌తో తెర లేవనుంది. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. 2008, 2014, 2015లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌కు గత ఏడాది నికో రోస్‌బర్గ్‌ షాక్‌ ఇచ్చాడు. ఓవరాల్‌గా రోస్‌బర్గ్‌ 385 పాయింట్లు సాధించి విజేతగా నిలువగా... హామిల్టన్‌ 380 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

అయితే రోస్‌బర్గ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఈ సంవత్సరం హామిల్టన్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. మాజీ చాంపియన్స్‌ సెబాస్టియన్‌ వెటెల్, కిమీ రైకోనెన్‌ (ఫెరారీ) నుంచి హామిల్టన్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు తరఫున సెర్గియో పెరెజ్, ఎస్టెబెన్‌ ఒకాన్‌ బరిలోకి దిగనున్నారు. కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌లో గత ఏడాది ఫోర్స్‌ ఇండియా 178 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కార్లు, వాటి టైర్ల వెడల్పును పెంచడం, ఇంధనం పరిమితిని పెంచడం... ఇతరత్రా మార్పులతో కొత్త సీజన్‌ మరింత ఆసక్తి రేకెత్తించనుంది. మొత్తం 20 రేసులు ఉన్న 2017 ఎఫ్‌1 సీజన్‌ ఈనెల 26న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలై నవంబరు 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ముగుస్తుంది.

2017 ఎఫ్‌1 షెడ్యూల్‌
మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి; ఏప్రిల్‌ 9: చైనా గ్రాండ్‌ప్రి; ఏప్రిల్‌ 16: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి; ఏప్రిల్‌ 30: రష్యా గ్రాండ్‌ప్రి; మే 14: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి; మే 28: మొనాకో గ్రాండ్‌ప్రి; జూన్‌ 11: కెనడా గ్రాండ్‌ప్రి; జూన్‌ 25: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి; జూలై 9: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి; జూలై 16: బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి; జూలై 30: హంగేరి గ్రాండ్‌ప్రి; ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్‌ప్రి; సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్‌ప్రి; సెప్టెంబరు 17: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి; అక్టోబరు 1: మలేసియా గ్రాండ్‌ప్రి; అక్టోబరు 8: జపాన్‌ గ్రాండ్‌ప్రి; అక్టోబరు 22: అమెరికా గ్రాండ్‌ప్రి; అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్‌ప్రి; నవంబరు 12: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి; నవంబరు 26: అబుదాబి గ్రాండ్‌ప్రి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement