రయ్ రయ్... రోస్‌బర్గ్ | Lewis Hamilton battles to third as Nico Rosberg wins in Japan | Sakshi
Sakshi News home page

రయ్ రయ్... రోస్‌బర్గ్

Published Mon, Oct 10 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

రయ్ రయ్... రోస్‌బర్గ్

 జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
 ఈ సీజన్‌లో తొమ్మిదో విజయం
 మెర్సిడెస్ జట్టుకు కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్  

 
 సుజుకా: గత రెండేళ్లలో జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. అయితే రెండుసార్లూ అతను లూయిస్ హామిల్టన్ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈసారి అలా జరగలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ చివరి ల్యాప్ వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. తొలిసారి జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
 
 53 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 26 నిమిషాల 43.333 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా... గత ఏడాది విజేత హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
 
 ఈ సీజన్‌లో తొమ్మిదో విజయాన్ని సాధించిన రోస్‌బర్గ్ కెరీర్‌లో ఇది 23వ టైటిల్. రోస్‌బర్గ్, హామిల్టన్ ఫలితాలతో... మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ వరుసగా మూడో ఏడాదీ మెర్సిడెస్ జట్టుకు (593 పాయింట్లు) ఖాయమైంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (313 పాయింట్లు), హామిల్టన్ (280 పాయింట్లు), రికియార్డో (212 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తదుపరి రేసు యూఎస్ గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. ‘హామిల్టన్, నాకు మధ్య 33 పాయింట్ల తేడా ఉంది. అయితే ఈ ఆధిక్యంపై నేను దృష్టి పెట్టలేదు. మిగిలిన మరో నాలుగు రేసుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాను. హామిల్టన్‌ను తక్కువ అంచనా వేయడంలేదు’ అని రోస్‌బర్గ్ వ్యాఖ్యానించాడు.
 
 గమ్యం చేరారిలా (టాప్-10): 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1:26:43.333 సెకన్లు), 2. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్-1:26:48.311 సె), 3. హామిల్టన్ (మెర్సిడెస్-1:26:49.109 సె), 4. వెటెల్ (ఫెరారీ-1:27:03.602 సె), 5. రైకోనెన్ (ఫెరారీ-1:27:11.703 సె), 6. రికియార్డో (రెడ్‌బుల్-1:27:17.274 సె), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1:27:40.828 సె), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా-1:27:42.510 సె), 9. మసా (విలియమ్స్-1:28:20.409 సె), 10. బొటాస్ (విలియమ్స్-1:28:21.656 సెకన్లు).
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement