హామిల్టన్ సరికొత్త రికార్డు
హంగారోరింగ్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గత బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఆ టైటిల్ ను వరుసగా మూడు సార్లు సాధించిన తొలి ఇంగ్లిష్ డ్రైవర్ గా ఘనత సాధించిన హామిల్టన్.. తాజాగా జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన డ్రైవర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలవడంతో ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు 2007, 09,12,13 సంవత్సరాల్లో హంగేరి గ్రాండ్ ప్రి ఫార్ములావన్ టైటిల్ ను హామిల్టన్ సాధించాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో హామిల్టన్ ఖాతాలోఐదో విజయం చేరడం మరో విశేషం. అంతకుముందు మొనాకో, కెనడా, ఆస్ట్రియన్, బ్రిటీష్ గ్రాండ్ ప్రిలను హామిల్టన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన హామిల్టన్ అదే ఊపును చివరి వరకూ కొనసాగించాడు. 70 ల్యాప్లో రేసును అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మరోవైపు రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికాయార్డో మూడో స్థానం సాధించాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్ బర్గ్ను హామిల్టన్ వెనుక్కునెట్టాడు. ఈ సీజన్లో తొలిసారి హామిల్టన్(181పాయింట్లు) ప్రథమ స్థానంలోకి రాగా, రోస్ బర్గ్(178పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు.