రోస్‌బర్గ్‌దే రాజసం...
సొంతగడ్డపై జర్మనీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
ఈ సీజన్‌లో నాలుగో విజయం
తొలి ల్యాప్‌లోనే మసా నిష్ర్కమణ
టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు
హాకెన్‌హీమ్: క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ సొంతగడ్డపై తొలిసారి విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రిలో ఈ జర్మన్ డ్రైవర్ 67 ల్యాప్‌ల రేసును గంటా 33 నిమిషాల 42.914 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ ఏదశలోనూ తడబడలేదు. ఆద్యంతం ఆధిపత్యం చలాయించి ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించాడు. అంతేకాకుండా 190 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు 20వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన లూయిస్ హామిల్టన్ అద్భుత ప్రదర్శనతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. వాస్తవానికి హామిల్టన్ ప్రధాన రేసును 15వ స్థానం నుంచి ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా గేర్ బాక్స్‌ను మార్చడంతో హామిల్టన్‌పై ఐదు గ్రిడ్‌ల పెనాల్టీని విధించారు. అయితే ఈ పెనాల్టీ అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఇక రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన బొటాస్ నిలకడగా రాణించి రెండో స్థానంలోనే రేసును ముగించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది.‘ఫోర్స్’ డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో... పెరెజ్ పదో స్థానంలో నిలిచారు.
మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఫెలిప్ మసా తొలి ల్యాప్‌లో మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ కెవిన్ మాగ్నుసెన్‌ను ఢీకొట్టాడు. ఘటన తీవ్రతకు మసా కారు గాల్లోకి గింగిరాలు తిరగడంతోపాటు, కారులో నుంచి నిప్పురవ్వలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో మసాకు ఎలాంటి గాయం కాలేదు. కానీ అతను తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. ఓవరాల్‌గా మసాతోపాటు ఇతర జట్టు డ్రైవర్లు క్వియాట్, సుటిల్, గ్రోస్యెన్ జర్మనీ గ్రాండ్‌ప్రిలో రేసును పూర్తి చేయకుండా మధ్యలోనై వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది.