రోస్‌బర్గ్‌దే విజయం
* బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
* హామిల్టన్‌కు రెండో స్థానం
సావోపాలో: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 31 నిమిషాల 09.090 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రోస్‌బర్గ్‌ను మొదటి ల్యాప్‌లో సహచరుడు లూయిస్ హామిల్టన్ ఓవర్‌టేక్ చేయబోయినా...
రోస్‌బర్గ్ చాకచక్యంగా డ్రైవ్ చేసి ముందుకు దూసుకెళ్లాడు. ఆ తర్వాత చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను ఖరారు చేసుకున్న హామిల్టన్ రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మాజీ చాంపియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంలో నిలిచాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (363 పాయింట్లు), రోస్‌బర్గ్ (297), వెటెల్ (266) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది.
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ఫలితాలు: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. గ్రోస్యెన్ (లోటస్), 9. వెర్‌స్టాపెన్ (ఎస్టీఆర్), 10. మల్డొనాడో (లోటస్), 11. రికియార్డో (రెడ్‌బుల్), 12. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 13. నాసర్ (సాబెర్), 14. బటన్ (మెక్‌లారెన్), 15. అలోన్సో (మెక్‌లారెన్), 16. ఎరిక్సన్ (సాబెర్), 17. స్టీవెన్స్ (మనోర్), 18. రోసీ (మనోర్).