Mercedes team
-
రసెల్‌కు ‘పోల్ పొజిషన్’
మాంట్రియల్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన కెరీర్లో రెండోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా తొమ్మిదో రేసు కెనడా గ్రాండ్‌ప్రిని రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్ సెషన్లో రసెల్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 12 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశారు. అయితే వెర్స్టాపెన్కంటే ముందుగా రసెల్ ఈ సమయాన్ని నమోదు చేయడంతో అతనికి పోల్ పొజిషన్ కేటాయించారు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లు కలిపి రసెల్ 26 ల్యాప్‌లు... వెర్స్టాపెన్ 27 ల్యాప్‌లు పూర్తి చేశారు. 2022లో హంగేరి గ్రాండ్‌ప్రిలో తొలిసారి రసెల్ ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించాడు. ఆ తర్వాత రసెల్‌కు మళ్లీ పోల్ పొజిషన్ దక్కలేదు. లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం నుంచి... ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) నాలుగో స్థానం నుంచి... డానియల్ రికార్డో (హోండా) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది రేసులు జరగ్గా... తొలి ఏడు రేసుల్లో వెర్స్టాపెన్, ఎనిమిదో రేసులో చార్లెస్ లెక్లెర్క్ పోల్ పొజిషన్లు సాధించారు. -
Hungarian GP Qualifying: రసెల్‌కు కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన ఫార్ములావన్ (ఎఫ్1) కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. బుడాపెస్ట్‌లో శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 24 ఏళ్ల రసెల్ అందరికంటే వేగంగా 1ని:17.377 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానం నుంచి... లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి... నోరిస్ (మెక్లారెన్) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్ మొత్తంలో 72 రేసుల్లో పాల్గొన్న రసెల్ ఈ సీజన్లో నాలుగు రేసుల్లో మూడో స్థానంలో నిలిచాడు. సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే నేటి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
అప్పీల్‌పై వెనక్కి తగ్గిన మెర్సిడెస్
ఫార్ములా వన్ సీజన్ ఫినాలే అబుదాబి గ్రాండ్‌ప్రిలో సేఫ్టీ కారు విషయంలో రేసింగ్ డైరెక్టర్ మైకేల్ మాసి తీసుకున్న నిర్ణయాలపై మరోసారి సమీక్షించాలంటూ అంతర్జాతీయ కోర్టులో వేసిన అప్పీల్‌పై మెర్సిడెస్ టీమ్ గురువారం వెనక్కి తగ్గింది. దానిని ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. హామిల్టన్‌తో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్ తన ప్రకటనలో తెలిపింది. -
నల్లజాతీయులకు అండగా నలుపు కార్లతో రేస్
లండన్: ఫార్ములావన్ (ఎఫ్1) చాంపియన్ జట్టు మెర్సిడెజ్ నల్ల జాతీయులకు అండగా... జాత్యాహంకారానికి వ్యతిరేకంగా స్పందిం చింది. 2020 సీజన్లో పూర్తిగా తమ కార్లు నలుపుమయం కానున్నాయని ప్రకటించింది. నలుపు రంగు కార్లతో ఫార్ములావన్‌లో తమ రేసర్లు పాల్గొంటారని తెలిపింది. సహజంగా మెర్సిడెజ్ సంస్థ ఎప్పుడైనా సిల్వర్ కలర్ కార్లతో సర్క్యూట్లో దూసుకెళ్లెది. అయితే జాత్యాహంకారానికి, నల్లజాతీయులపై దమనకాండకు ముగింపు పలికే కార్యక్రమంలో భాగంగానే తాము ఈ సీజన్లో నలుపు కార్లతో బరిలోకి దిగుతున్నామని టీమ్ ప్రిన్సిపల్ టొటొ వోల్ఫ్ వెల్లడించారు. ‘ఇక వర్ణవివక్షపై మౌనముద్ర ఉండదు. ప్రపంచ క్రీడా వేదికపై మా గళం వినిపించేలా.... మా సంకల్పం ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో వస్తున్నాం. ఈ వివక్షను ఉపేక్షించం. జాత్యాహంకారం నశించిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని అన్నారు. ఈ ఆదివారం జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్, అతని సహచరుడు బొటాస్ నలుపు కార్లతో ట్రాక్‌పై దూసుకెళ్లనున్నారు. -
హామిల్టన్‌కు 87వ ‘పోల్’
హాకెన్‌హీమ్ (జర్మనీ): ఈ సీజన్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.767 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఈ సీజన్లో పది రేసులు జరగ్గా... ఏడింటిలో హామిల్టనే విజేత. మరో రెండు రేసుల్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నెగ్గగా... మరోదాంట్లో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ వెటెల్ తొలి క్వాలిఫయింగ్ సెషన్‌ను దాటలేకపోయాడు. ఆదివారం జరిగే రేసును అతను చివరిదైన 20వ స్థానం నుంచి మొదలు పెడతాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. పియరీ గాస్లీ (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (అల్ఫా రోమియో), 6. గ్రోస్యెన్ (హాస్), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 9. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 10. లెక్లెర్క్ (ఫెరారీ), 11. గియోవినాజి (అల్ఫా రోమియో), 12. మాగ్నుసెన్ (హాస్), 13. రికియార్డో (రెనౌ), 14. క్వియాట్ (ఎస్టీఆర్), 15. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 16. లాండో నోరిస్ (మెక్లారెన్), 17. అలెగ్జాండర్ ఆల్బోన్ (ఎస్టీఆర్), 18. జార్జి రసెల్ (విలియమ్స్), 19. రాబర్ట్ కుబికా (విలియమ్స్), 20. వెటెల్ (ఫెరారీ). సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
భళా...బొటాస్
బాకు (అజర్బైజాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ బొటాస్ ఈ సీజన్లో రెండో టైటిల్ ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన బొటాస్ గంటా 31 నిమిషాల 52.942 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ ఏడాది జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే వచ్చాయి. ఫార్ములావన్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1992లో విలియమ్స్ జట్టు సీజన్‌లోని తొలి మూడు రేసుల్లో ఈ ఘనత సాధించింది. ఆదివారం జరిగిన రేసుతో మెర్సిడెస్ ఈ రికార్డును సవరించింది. -
హామిల్టన్‌కే పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా 1 ని.58.179 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానం పొందగా, రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
ఎదురులేని హామిల్టన్
బార్సిలోనా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో టైటిల్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది రెండో టైటిల్ కాగా కెరీర్లో 64వ విజయం. నాటకీయ పద్ధతిలో మొదలైన ఈ రేసులో తొలి ల్యాప్‌లోనే హాస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా...మరో డ్రైవర్ ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. సీజన్లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. -
హామిల్టన్‌కు ‘పోల్’
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో నాలుగో టైటిల్ సాధించడమే లక్ష్యంగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.593 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఐదో పోల్ పొజిషన్. బొటాస్ (మెర్సిడెస్), రైకోనెన్, వెటెల్ (ఫెరారీ) రెండు, మూడు, నాలుగు స్థానాల నుంచి... ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
రోస్బర్గ్కు ఆరో ‘పోల్’
నేడు బెల్జియం గ్రాండ్‌ప్రి రేసు స్పా-ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): మరోసారి క్వాలిఫరుుంగ్‌లో రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫరుుంగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 48.744 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
ఎదురులేని హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్‌లో తడబడినా... ప్రధాన రేసులో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 67 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానంతో ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ గంటా 30 నిమిషాల 44.200 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఆరో టైటిల్ కావడం విశేషం. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలెట్టిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ 217 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
మళ్లీ రోస్బర్గ్కే ‘పోల్’
హాకెన్‌హీమ్ (జర్మనీ) : సొంతగడ్డపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రాణించాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 14.363 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది ఐదో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
రోస్బర్గ్కు నాలుగో పోల్
నేడు హంగేరి గ్రాండ్‌ప్రి హంగారోరింగ్: ఈ సీజన్లో ఆరో టైటిల్‌ను సాధించేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ కు మరో అవకాశం లభించింది. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 19.965 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ 13వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది నాలుగో పోల్ కావడం విశేషం. ఈ రేసుకు ముందు పోల్ పొజిషన్‌తో మొదలుపెట్టిన మూడు రేసుల్లోనూ రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. -
రోస్‌బర్గ్‌దే హవా
► మెర్సిడెస్ డ్రైవర్‌కే పోల్ పొజిషన్ ► నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.417 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో జరిగిన తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో హామిల్టన్ రెండో క్వాలిఫయింగ్‌ను దాట లేకపోయాడు. ప్రధాన రేసును అతను పదో స్థానం నుంచి మొదలు పెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
రోస్‌బర్గ్‌దే విజయం
* బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * హామిల్టన్‌కు రెండో స్థానం సావోపాలో: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 31 నిమిషాల 09.090 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రోస్బర్గ్ను మొదటి ల్యాప్‌లో సహచరుడు లూయిస్ హామిల్టన్ ఓవర్టేక్ చేయబోయినా... రోస్‌బర్గ్ చాకచక్యంగా డ్రైవ్ చేసి ముందుకు దూసుకెళ్లాడు. ఆ తర్వాత చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఐదో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను ఖరారు చేసుకున్న హామిల్టన్ రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మాజీ చాంపియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంలో నిలిచాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (363 పాయింట్లు), రోస్‌బర్గ్ (297), వెటెల్ (266) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ఫలితాలు: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. గ్రోస్యెన్ (లోటస్), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 10. మల్డొనాడో (లోటస్), 11. రికియార్డో (రెడ్‌బుల్), 12. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 13. నాసర్ (సాబెర్), 14. బటన్ (మెక్లారెన్), 15. అలోన్సో (మెక్లారెన్), 16. ఎరిక్సన్ (సాబెర్), 17. స్టీవెన్స్ (మనోర్), 18. రోసీ (మనోర్). -
విశ్వ విజేత హామిల్టన్
1995లో... బ్రిటన్‌లో ఆటో స్పోర్ట్స్ అవార్డు ఫంక్షన్ జరుగుతోంది. ఓ పదేళ్ల పిల్లాడు మెక్లారెన్ జట్టు యజమాని దగ్గరకు వచ్చి... ‘ఏదో ఒక రోజు నేను మెక్లారెన్ తరఫున రేసులో పాల్గొంటా’ అన్నాడు. జట్టు యజమానితో పాటు పక్కన ఉన్నవాళ్లు కూడా అవాక్కయ్యారు. ఓ చిన్న పిల్లాడిలో ఏంటీ ఆత్మవిశ్వాసం అనుకున్నారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత, 2007లో అదే మెక్లారెన్ తరఫున అరంగేట్రం చేశాడు ఆ కుర్రాడు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు... ఆరేళ్ల వయసు నుంచే రేసింగ్‌ను ప్రాణంలా మార్చుకుని పడ్డ కష్టానికి ప్రతిఫలం అది. ఆ రోజు నుంచి వెనుతిరిగి చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఆ సంచలనం పేరు లూయిస్ హామిల్టన్. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా అవతరించడం ద్వారా... మూడోసారి టైటిల్ గెలిచి దిగ్గజాల సరసన స్థానం సంపాదించుకున్నాడు. * మూడోసారి ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కైవసం * యూఎస్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో పదో విజయం ఆస్టిన్ (అమెరికా): ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్... మరో మూడు రేసులు మిగిలుండగానే ప్రపంచ విజేతగా అవతరించాడు. ఈ ఏడాది పదో విజయం సాధించి... 327 పాయింట్లతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. నాటకీయ పరిణామాల మధ్య హోరాహోరీగా సాగిన యునెటైడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటిష్ రేసర్ విజేతగా నిలిచాడు. సీజన్లో ఇప్పటివరకూ జరిగిన 16 రేసుల్లో తనకు ఇది పదో టైటిల్. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 50 నిమిషాల 52.703 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే 49వ ల్యాప్‌లో హామిల్టన్ దూకుడుగా వ్యవహరించి రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత చివరి వరకూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు. రోస్బర్గ్కు రెండో స్థానం దక్కగా... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. * భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సెర్గియో పెరె జ్ ఐదోస్థానంలో నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ 35 ల్యాప్‌ల తర్వాత రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రతికూల వాతావరణంలో జరిగిన ఈ రేసులో వివిధ కారణాలతో 8 మంది డ్రైవర్లు మధ్యలోనే వైదొలగడం గమనార్హం. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబరు 1న జరుగుతుంది. * ప్రస్తుతం హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో 327 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెటెల్ (251 పాయింట్లు) రెండో స్థానంలో, రోస్‌బర్గ్ (247 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థుల కంటే ఎక్కువ పాయింట్లు ఉండటంతో... తదుపరి మూడు రేసుల ఫలితాలతో సంబంధం లేకుండా హామిల్టన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైంది. ఘనతలు * అరంగేట్రం చేసిన ఏడాదే నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన ఒకే ఒక్క రేసర్ హామిల్టన్. కెరీర్ ఆరంభం నుంచి ప్రతి ఏటా హామిల్టన్ కనీసం ఒక్క రేసులో అయినా నెగ్గాడు. ప్రస్తుతం ఉన్న రేసర్లలో ఎవరికీ ఈ రికార్డు లేదు. * మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్), అలైన్ ప్రోస్ట్ (51 టైటిల్స్) తర్వాత 43 గ్రాండ్‌ప్రి టైటిల్స్‌తో ఎఫ్1 చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డ్రైవర్ హామిల్టన్. * మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో డ్రైవర్‌గా ఘనత. గతంలో మైకేల్ షుమాకర్ (7 సార్లు), ఫాంగియో (5 సార్లు), ప్రోస్ట్, సెబాస్టియన్ వెటెల్ (4 సార్లు) ఈ ఘనత సాధించారు. * తొమ్మిదేళ్ల వ్యవధిలో హామిల్టన్ మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... షుమాకర్ రెండుసార్లు మాత్రమే ఈ ఘనత సాధించాడు. * కెరీర్లో అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్ల జాబితాలో హామిల్టన్ (49) మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో షుమాకర్ (68), అయర్టన్ సెనా (65) ఉన్నారు. లూయిస్ హామిల్టన్‌కు ఆరేళ్ల వయసులో వాళ్ల నాన్న ఓ రిమోట్ కారు కొనిచ్చాడు. పిల్లాడు ఆడుకోవడానికే కారు అనుకున్నాడాయన. కానీ ఆ క్షణం ఆయనకూ తెలియదు తాను ఓ ప్రపంచ చాంపియన్‌కు బీజం వేశానని.. ఆ బొమ్మకారు మీద ఆసక్తితో హామిల్టన్ ప్రపంచం గర్వించదగ్గ రేసర్‌గా ఎదుగుతాడని.. 1985 జనవరి 7న ఇంగ్లండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో స్టీవెనేజ్ అనే ప్రదేశంలో హామిల్టన్ జన్మించాడు. తల్లి కార్మెన్ బ్రిటిష్ జాతీయురాలు. తండ్రి ఆంథోని కూడా బ్రిటిష్ జాతీయుడే అయినా... ఎప్పుడో వలస వచ్చిన నల్లజాతి వ్యక్తి. హామిల్టన్‌కు రెండేళ్ల వయసులో తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. తనకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకూ తల్లి దగ్గర పెరిగాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లిపోయాడు. ఆరేళ్ల వయసులో తండ్రి కొనిచ్చిన రిమోట్ కారుతో రేసింగ్ మీద మక్కువ పెంచుకున్న హామిల్టన్... తర్వాత రెండేళ్లకు కార్టింగ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1993లో ఎనిమిదేళ్ల వయసులో కార్టింగ్‌ను సీరియస్‌గా ప్రారంభించిన హామిల్టన్ స్వల్ప వ్యవధిలోనే క్యాడెట్ విభాగంలో చాంపియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఫార్ములా ‘ఎ’... ఫార్ములా సూపర్ ‘ఎ’... ఇంటర్ కాంటినెంటర్ ‘ఎ’ లాంటి కారు రేసుల్లో తనని తాను నిరూపించున్నాడు. 2001లో హామిల్టన్ రేసింగ్ ప్రస్థానం మొదలైంది. బ్రిటిష్ వింటర్ సీజన్ ఫార్ములాలో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్రమంగా ఫార్ములా-3 రేసుల్లోకి వెళ్లాడు. ఏ స్థాయిలో ఏ రేసులో పాల్గొన్నా అతి తక్కువ సమయంలోనే రేసు గెలిచి సంచలనం సృష్టించేవాడు. ఫార్ములా-3 విజయంతో జీపీ-2లోకి ప్రవేశించాడు. తొలి ఏడాదే అక్కడా చాంపియన్‌గా అవతరించాడు. మెక్‌లారెన్‌తో అరంగేట్రం 2007లో 22 ఏళ్ల వయసులో హామిల్టన్ కల సాకారమైంది. మెక్లారెన్ జట్టులో రెండో రేసర్‌గా అవకాశం వచ్చింది. తన తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మూడో స్థానంలో నిలిచిన హామిల్టన్... అరంగేట్రంలోనే పోడియం మీదకు వచ్చిన 13వ డ్రైవర్‌గా ఫార్ములావన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవడం ద్వారా తొలిసారి ఎఫ్1 రేసు నెగ్గాడు. ఆ తర్వాతి వారమే యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ టైటిల్ సాధించాడు. అదే ఏడాది ఓవరాల్‌గా సీజన్లో రెండో స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. 2008లో అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. 2009 నుంచి 2013 వరకు టాప్-3లో నిలువలేకపోయాడు. అయితే ప్రతి రేసులోనూ తన ఉనికిని మాత్రం చాటుకునే వాడు. మెక్‌లారెన్‌తో తన ప్రస్థానం 2012తో ముగిసింది. 2013 నుంచి మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. 2014లో మరోసారి తన సత్తా చాటుతూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్... ఈ ఏడాది అదే టైటిల్ నిలబెట్టుకున్నాడు. సీజన్లో మరో మూడు రేసులు మిగిలుండగానే చాంపియన్‌గా అవతరించడం తన సాధికారతకు నిదర్శనం. తొలి ‘నలువు’ రేసర్ నిజానికి హామిల్టన్ బ్రిటిష్ జాతీయుడే అయినా ‘నల్ల’రేసర్ అనే ముద్ర పడింది. తండ్రిలాగే నలుపు రంగులో ఉండే హామిల్టన్‌ను ఫార్ములావన్ చరిత్రలో తొలి నల్ల జాతీయుడిగా పరిగణించారు. 2007లో తొలిసారి హామిల్టన్ వివాదంలోకి వెళ్లాడు. ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన ఏడాదే తన నివాసాన్ని స్విట్జర్లాండ్‌కు మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. మీడియా బాధలు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాడు. అయితే కేవలం పన్నులు ఎగ్గొట్టడానికి ఇలాంటి నిర్ణయమంటూ బ్రిటన్ ఎంపీలు విమర్శించారు. 2007లోనే తొలిసారి నికోల్ ష్రెజింగర్ అనే సింగర్‌తో ప్రేమలో పడ్డ హామిల్టన్... ఇప్పటివరకూ ఆమెతో నాలుగుసార్లు తెగదెంపులు చేసుకున్నాడు. ఓ ఏడాది విడిపోవడం, తిరిగి మరో ఏడాది కలిసి ఉండటంలా వీళ్ల ప్రణయ ప్రయాణం సాగింది. చివరిసారిగా ఫిబ్రవరి 2015లో వీళ్లిద్దరూ విడిపోయారు. 2012లో స్విట్జర్లాండ్ నుంచి మొనాకోకు నివాసం మార్చుకున్న హామిల్టన్... ఏ దేశంలో నివసిస్తున్నా ఫార్ములావన్‌లో మాత్రం బ్రిటిష్ డ్రైవర్‌గానే కొనసాగుతున్నాడు. -సాక్షి క్రీడావిభాగం తండ్రి కష్టానికి ఫలితం హామిల్టన్‌ను రేసర్‌గా మలచడానికి అతని తండ్రి ఆంథోని ఎన్నో త్యాగాలు చేశారు. చాలా కష్టపడ్డారు. ఐటీ మేనేజర్‌గా తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో బయటకు వచ్చి కాంట్రాక్టు ఉద్యోగాలు చేశారు. ఒక దశలో రోజూ మూడు రకాల ఉద్యోగాలకూ వెళ్లేవారు. కొంతకాలానికి సొంత కంప్యూటర్ పరికరాల కంపెనీ పెట్టుకున్నారు. హామిల్టన్ రేసర్‌గా ఎదిగిన తర్వాత తన కుమారుడి వ్యవహారాలు చూసే మేనేజర్‌గా మారారు. ఫార్ములావన్ రేసర్ కావాలనే తన కుమారుడి కలను సాకారం చేయడానికి ఆ తండ్రి పడ్డ కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘‘నా జీవితంలో ఇవి అత్యంత మధుర క్షణాలు. నా విజయం కోసం పాటుపడిన జట్టు సిబ్బందికి, నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాను.’’ - హామిల్టన్ -
రోస్‌బర్గ్ రెండోసారి...
- మెర్సిడెస్ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ - నేడు జపాన్ గ్రాండ్‌ప్రి సుజుకా (జపాన్): గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు నికో రోస్‌బర్గ్, లూయిస్ హామిల్టన్ మళ్లీ గాడిలో పడ్డారు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించగా... హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ ఇద్దరూ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభిస్తారు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది రెండో ‘పోల్ పొజిషన్’ కాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా రెండోసారి. క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.584 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బొటాస్ (విలియమ్స్) మూడో స్థానం నుంచి, ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్లో ఇప్పటికే 42 గ్రాండ్‌ప్రి టైటిల్స్ సాధించిన వెటెల్... గ్రిడ్ పొజిషన్స్‌లో టాప్-3లో లేకుండా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన వెటెల్ జపాన్‌లో ఏం చేస్తాడో వేచి చూడాలి. ఇక భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. నేటి ప్రధాన రేసు ఉదయం గం. 10.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
విజేత రోస్‌బర్గ్
బార్సిలోనా : ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచి తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 41 నిమిషాల 12.555 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్బర్గ్కు ఏదశలోనూ తన సమీప ప్రత్యర్థులతో పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ గంటా 41 నిమిషాల 30.066 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 13వ స్థానంలో, నికో హుల్కెన్‌బర్గ్ 15వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్ కూడా నెగ్గలేకపోయారు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా తొమ్మిదో ఏడాది కొత్త విజేత అవతరించడం విశేషం. అంతేకాకుండా 14వసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లిద్దరూ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. ఐదు రేసుల తర్వాత ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ రేసులో హామిల్టన్ (111 పాయింట్లు), రోస్‌బర్గ్ (91), వెటెల్ (80) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
రోస్బర్గ్కు తొలి పోల్
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా : ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సంపాదించి దూకుడు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు సహచరుడు నికో రోస్‌బర్గ్ చెక్ పెట్టాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లలో కలిపి రోస్‌బర్గ్ మొత్తం 18 ల్యాప్‌లు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఒక నిమిషం 24.681 సెకన్లలో అందరికంటే వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ ఒక నిమిషం 24.948 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. మాజీ చాంపియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 17వ, సెర్గియో పెరెజ్ 18వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
హమిల్టన్ X రోస్ జర్గ్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఈ ఏడాది విజేత ఎవరో ఆదివారం జరిగే చివరిదైన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో తేలుతుంది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.480 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది 11వ పోల్ కావడం విశేషం. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో ఈ ఇద్దరు మాత్రమే ఉండటంతో చివరి రేసు వీరిద్దరికీ కీలకంగా మారింది. హామిల్టన్ 334 పాయింట్లతో, రోస్‌బర్గ్ 317 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గత రేసులకు భిన్నంగా ఈ రేసులో విజేత నుంచి చివరి స్థానంలో నిలిచిన వారందరికీ రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. సాధారణ రేసులో విజేతకు 25 పాయింట్లు లభిస్తే... ఈ రేసులో నెగ్గితే 50 పాయింట్లు దక్కుతాయి. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. పెరెజ్ 13వ, హుల్కెన్‌బర్గ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. గ్రిడ్ పొజిషన్స్ స్థానం డ్రైవర్ జట్టు 1 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 2 హామిల్టన్ మెర్సిడెస్ 3 బొటాస్ విలియమ్స్ 4 మసా విలియమ్స్ 5 రికియార్డో రెడ్‌బుల్ 6 వెటెల్ రెడ్‌బుల్ 7 క్వియాట్ ఎస్టీఆర్ 8 బటన్ మెక్లారెన్ 9 రైకోనెన్ ఫెరారీ 10 అలోన్సో ఫెరారీ 11 మాగ్నుసన్ మెక్లారెన్ 12 జీన్ వెర్జెన్ ఎస్టీఆర్ 13 పెరెజ్ ఫోర్స్ ఇండియా 14 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా 15 సుటిల్ సాబెర్ 16 గ్రోస్యెన్ లోటస్ 17 గుటిరెజ్ సాబెర్ 18 మల్డొనాడో లోటస్ 19 కొబయాషి కాటర్‌హమ్ 20 విల్ స్టీవెన్స్ కాటర్‌హమ్ -
హామిల్టన్‌కు పదో టైటిల్
ఆస్టిన్: తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పదో విజయాన్ని సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ 56 ల్యాప్‌లను గంటా 40 నిమిషాల 04.785 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా కెరీర్లో 32వ టైటిల్. ఈ గెలుపుతో ఫార్ములావన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన బ్రిటన్ డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు ఈ రికార్డు నెజైల్ మాన్సెల్ (31 విజయాలు) పేరిట ఉండేది. మరోవైపు హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ పదోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రోస్‌బర్గ్ 23 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే రోస్‌బర్గ్ వెన్నంటే నిలిచిన హామిల్టన్ 24వ ల్యాప్‌లో తన సహచరుడిని ఓవర్టేక్ చేస్తూ ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి దూకుడు పెంచిన హామిల్టన్ తుదకు ఐదు సెకన్ల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ ఇంజిన్ వైఫల్యంతో 16వ ల్యాప్‌లో వైదొలగగా... సెర్గియో పెరెజ్ తొలి ల్యాప్‌లోనే సాబెర్ జట్టు డ్రైవర్ సుటిల్ కారును ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. సీజన్లో మరో రెండు రేసులు మిగిలి ఉన్నాయి. తదుపరి రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది. ఈనెల 23న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ఫార్ములావన్ సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం హామిల్టన్ 316 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ముందున్నాడు. రోస్‌బర్గ్ 292 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో రెండు రేసులు మిగిలి ఉన్న నేపథ్యంలో వీరిద్దరిలో ఒకరికి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కనుంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 316 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 292 3 రికియార్డో రెడ్‌బుల్ 214 4 బొటాస్ విలియమ్స్ 155 5 వెటెల్ రెడ్‌బుల్ 149 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 608 2 రెడ్‌బుల్ 363 3 విలియమ్స్ 238 4 ఫెరారీ 196 5 మెక్లారెన్ 147 గమ్యం చేరారిలా... స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 1:40:04.785 25 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 1:40:09.099 18 3 రికియార్డో రెడ్‌బుల్ 1:40:30.345 15 4 మసా విలియమ్స్ 1:40:31.709 12 5 బొటాస్ విలియమ్స్ 1:40:35.777 10 6 అలోన్సో ఫెరారీ 1:41:40.016 8 7 వెటెల్ రెడ్‌బుల్ 1:41:40.519 6 8 మాగ్నుసెన్ మెక్లారెన్ 1:41:45.467 4 9 జీన్ వెర్జెన్ ఎస్టీఆర్ 1:41:48.648 2 10 మల్డొనాడో లోటస్ 1:41:52.655 1 నోట్: సమయం-గంటలు, నిమిషాలు, సెకన్లలో -
హామిల్టన్‌కు ఏడో ‘పోల్'
నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 38.513 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), బొటాస్ (విలియమ్స్), బటన్ (మెక్లారెన్), క్వియాట్ (ఎస్టీఆర్), రికియార్డో (రెడ్‌బుల్), అలోన్సో (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), వెటెల్ (రెడ్‌బుల్), మాగ్నుసన్ (మెక్లారెన్), పెరెజ్ (ఫోర్స్ ఇండియా), గుటిరెజ్ (సాబెర్), సుటిల్ (సాబెర్), గ్రోస్యెన్ (లోటస్), ఎరిక్సన్ (కాటర్‌హమ్), హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), మసా (విలియమ్స్), కొబయాషి (కాటర్‌హమ్), మల్డొనాడో (లోటస్), చిల్టన్ (మారుసియా) వరుసగా 2 మొదలుకొని 21వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
హామిల్టన్‌కు ఆరో ‘పోల్’
సింగపూర్: ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే సింగపూర్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 45.681 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రికియార్డో (రెడ్‌బుల్), వెటెల్ (రెడ్‌బుల్), అలోన్సో (ఫెరారీ), మసా (విలియమ్స్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్), మాగ్నుసన్ (మెక్లారెన్), క్వియాట్ (ఎస్టీఆర్), బటన్ (మెక్లారెన్), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), గుటిరెజ్ (సాబెర్), పెరెజ్ (ఫోర్స్ ఇండియా), గ్రోస్యెన్ (లోటస్), సుటిల్ (సాబెర్), మల్డొనాడో (లోటస్), బియాంచి (మారుసియా), కొబయాషి (కాటర్‌హమ్), చిల్టన్ (మారుసియా), ఎరిక్సన్ (మారుసియా) వరుసగా 2 నుంచి 22 గ్రిడ్ పొజిషన్స్‌లో రేసును మొదలుపెడతారు. -
రోస్‌బర్గ్ ‘ఏడోసారి’
- ఈ సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్‌కు ఏడో పోల్ - హామిల్టన్‌కు రెండో స్థానం - నేడు బెల్జియన్ గ్రాండ్ ప్రి స్పా (బెల్జియం): ఫార్ములావన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఇది అతడికి వరుసగా నాలుగో పోల్ పొజిషన్ కావడం విశేషం. శనివారం అర్డెన్నెస్ ఫారెస్ట్‌లోని స్పా-ఫ్రాంకోర్చాంప్స్ సర్క్యూట్‌పై జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో అతను అందరికంటే వేగంగా 2 నిమిషాల 5.698 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. వర్షం మధ్య సాగిన క్వాలిఫయింగ్‌లో మెర్సిడెస్ మరో డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (2 నిమిషాల 5.819 సెకన్లు) చివరి వరకు గట్టిపోటి ఇచ్చాడు. అయితే కారులో బ్రేక్ సమస్యలు రావడంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. జూన్‌లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి తర్వాత మళ్లీ మెర్సిడెజ్ డ్రైవర్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే మొదటిసారి. బెల్జియన్ గ్రాండ్ ప్రి డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్, అలోన్సో, రికియార్డో తర్వాతి మూడు స్థానాల్లో నిలిచారు. నిరాశపర్చిన ‘ఫోర్స్’ క్వాలిఫయింగ్ సెషన్లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు నిరాశపర్చారు. ఈ సీజన్లో హుల్కెన్‌బర్గ్ తొలిసారి క్వాలిఫయింగ్ తొలి దశలోనే వెనుదిరిగాడు. అయితే మరో డ్రైవర్ పెరెజ్.. క్యూ-2లో 2 నిమిషాల 10.084 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేయడంతో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు. -
ఆరేళ్ల తర్వాత...
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): ఆశ్చర్యం... అద్భుతం... ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తొలి ఏడు రేసుల్లో పూర్తి ఆధిపత్యం చలాయించిన మెర్సిడెస్ జట్టు జోరుకు కళ్లెం పడింది. తొలి ఏడు రేసుల్లో ఆ జట్టుకు చెందిన ఇద్దరు డ్రైవర్లలో కనీసం ఒకరు ‘పోల్ పొజిషన్’ సాధించారు. అయితే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో మాత్రం ఊహించని ఫలితం వెలువడింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ విలియమ్స్ జట్టుకు చెందిన ఫెలిప్ మసా ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును మసా తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. విలియమ్స్ జట్టుకే చెందిన వాల్టెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తోన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. గతంలో ఫెరారీ జట్టు తరఫున పోటీపడిన మసా క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 08.759 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత తొలిసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. చివరిసారి 2008 నవంబరులో సొంతగడ్డపై జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో మసా ‘పోల్ పొజిషన్’ సాధించడమే కాకుండా రేసులోనూ విజేతగా నిలిచాడు. ‘చాలా కాలం తర్వాత పోల్ పొజిషన్ సాధించినందుకు అమితానందంగా ఉన్నాను. ప్రధాన రేసుపై పూర్తి ఏకాగ్రత సారించాను. తొలి స్థానం పొందడమే లక్ష్యంగా ఆదివారం బరిలోకి దిగుతాను’ అని మసా వ్యాఖ్యానించాడు.భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ 10వ స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. క్వాలిఫయింగ్‌లో పెరెజ్ 11వ స్థానం... చిల్టన్ 21వ స్థానం పొందారు. అయితే రెండో రౌండ్లో ఇతర కార్లను ఢీకొట్టడంతో పెరెజ్‌పై ఐదు, చిల్టన్పై మూడు గ్రిడ్ల పెనాల్టీ పడింది.