ఆరేళ్ల తర్వాత... | 2014 Austrian GP Qualifying: Felipe Massa claims pole as Williams shock Mercedes | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల తర్వాత...

Published Sun, Jun 22 2014 1:27 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM

ఆరేళ్ల తర్వాత... - Sakshi

ఆరేళ్ల తర్వాత...

స్పీల్‌బర్గ్ (ఆస్ట్రియా): ఆశ్చర్యం... అద్భుతం... ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తొలి ఏడు రేసుల్లో పూర్తి ఆధిపత్యం చలాయించిన మెర్సిడెస్ జట్టు జోరుకు కళ్లెం పడింది. తొలి ఏడు రేసుల్లో ఆ జట్టుకు చెందిన ఇద్దరు డ్రైవర్లలో కనీసం ఒకరు ‘పోల్ పొజిషన్’ సాధించారు. అయితే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో మాత్రం ఊహించని ఫలితం వెలువడింది.

శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ విలియమ్స్ జట్టుకు చెందిన ఫెలిప్ మసా ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును మసా తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. విలియమ్స్ జట్టుకే చెందిన వాల్టెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు.
 
గతంలో ఫెరారీ జట్టు తరఫున పోటీపడిన మసా క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 08.759 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత తొలిసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. చివరిసారి 2008 నవంబరులో సొంతగడ్డపై జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో మసా ‘పోల్ పొజిషన్’ సాధించడమే కాకుండా రేసులోనూ విజేతగా నిలిచాడు.

‘చాలా కాలం తర్వాత పోల్ పొజిషన్ సాధించినందుకు అమితానందంగా ఉన్నాను. ప్రధాన రేసుపై పూర్తి ఏకాగ్రత సారించాను. తొలి స్థానం పొందడమే లక్ష్యంగా ఆదివారం బరిలోకి దిగుతాను’ అని మసా వ్యాఖ్యానించాడు.భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ 10వ స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. క్వాలిఫయింగ్‌లో పెరెజ్ 11వ స్థానం... చిల్టన్ 21వ స్థానం పొందారు. అయితే రెండో రౌండ్‌లో ఇతర కార్లను ఢీకొట్టడంతో పెరెజ్‌పై ఐదు, చిల్టన్‌పై మూడు గ్రిడ్‌ల పెనాల్టీ పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement