లూయిస్ హామిల్టన్
బార్సిలోనా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో రెండో టైటిల్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది రెండో టైటిల్ కాగా కెరీర్‌లో 64వ విజయం.
నాటకీయ పద్ధతిలో మొదలైన ఈ రేసులో తొలి ల్యాప్‌లోనే హాస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా...మరో డ్రైవర్ ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment