Spain Grand Prix
-
Lewis Hamilton: వరుసగా ఐదో విజయం!
బార్సిలోనా (స్పెయిన్): ఆరంభంలో ఆధిక్యం కోల్పోయినా... ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేస్తూ... చివరి దశలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి... ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసును సొంతం చేసుకున్నాడు. 66 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసులో ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి మలుపు వద్ద రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ దూకుడు కొనసాగించగా... మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేందుకు హామిల్టన్ పట్టువదలకుండా ప్రయత్నించాడు. రేసు మరో ఆరు ల్యాప్‌ల్లో తర్వాత ముగుస్తుందనగా హామిల్టన్ వేగాన్ని పెంచి వెర్స్టాపెన్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఆరు ల్యాప్‌ల్లో వెర్‌స్టాపెన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా హామిల్టన్ ట్రాక్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయి లక్ష్యాన్ని గంటా 33 నిమిషాల 07.680 సెకన్లలో అందుకొని విజేతగా నిలిచాడు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా ఓవరాల్‌గా ఆరోది. హామిల్టన్కంటే ముందు దివంగత దిగ్గజ డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్) మాత్రమే ఒకే గ్రాండ్‌ప్రిలో (మొనాకో గ్రాండ్‌ప్రి 1989 నుంచి 1993 వరకు) వరుసగా ఐదేళ్లు విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 98వ విజయం. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. లెక్లెర్క్ (ఫెరారీ), 5. పెరెజ్ (రెడ్‌బుల్), 6. రికియార్డో (మెక్లారెన్), 7. సెయింజ్ (ఫెరారీ), 8. నోరిస్ (మెక్లారెన్), 9. ఒకాన్ (అల్పైన్), 10. గాస్లీ (అల్ఫా టౌరి). -
Lewis Hamilton: హామిల్టన్ ‘సెంచరీ’
బార్సిలోనా (స్పెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మరో రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ‘పోల్ పొజిషన్’ సాధించడంద్వారా ఎఫ్1 క్రీడా చరిత్రలో 100 పోల్ పొజిషన్స్ సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. చివరి క్వాలిఫయింగ్ సెషన్లో ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.741 సెకన్లలో ముగించిన హామిల్టన్ కెరీర్లో 100వ పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక పోల్ పొజిషన్స్ (68) రికార్డును 2017లోనే బద్దలు కొట్టిన హామిల్టన్ నాలుగేళ్ల తర్వాత ‘సెంచరీ’ మైలురాయిని చేరుకున్నాడు. ► 2007లో మాంట్రియల్లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్ కెరీర్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ► 2012 వరకు మెక్లారెన్ జట్టుతోనే కొనసాగిన హామిల్టన్ ఆ జట్టు తరఫున 26 పోల్ పొజిషన్స్ సాధించాడు. ► 2013 సీజన్ నుంచి మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్ ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్ తరఫున హామిల్టన్ 74 పోల్ పొజిషన్స్‌ను కైవసం చేసుకున్నాడు. తన 14 ఏళ్ల ఎఫ్1 కెరీర్లో హామిల్టన్ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ క్రీడలో అత్యధిక విజయాలు (97) సాధించిన డ్రైవర్‌గానూ గుర్తింపు పొందాడు. ► స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో భాగంగా జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ సహచరుడు వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని పొందాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్); 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్); 3. బొటాస్ (మెర్సిడెస్); 4. లెక్లెర్క్ (ఫెరారీ); 5. ఎస్తెబన్ ఒకాన్ (అలైన్); 6. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ); 7. రికియార్డో (మెక్లారెన్); 8. సెర్గియోపెరెజ్ (రెడ్‌బుల్); 9. లాండో నోరిస్ (మెక్లారెన్); 10. ఫెర్నాండో అలోన్సో (అలైన్); 11. లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్); 12. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి); 13. సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్); 14. జియోవినాజి (అల్ఫా రోమియో); 15. జార్జి రసెల్ (విలియమ్స్); 16. యుకీ సునోడా (అల్ఫా టౌరి); 17. కిమీ రైకోనెన్ (అల్ఫా రోమియో); 18. మిక్ షుమాకర్ (హాస్); 19. నికోలస్ లతీఫి (విలియమ్స్); 20. నికిటా మేజ్‌పిన్ (హాస్). -
ఓ పట్టుపట్టి స్వర్ణం సాధించింది
మాడ్రిడ్: గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ స్పెయిన్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సత్తా చాటింది. మాడ్రిడ్ వేదికగా జరుగుతున్న రెజ్లింగ్ క్రీడలో (50 కేజీల విభాగం) కెనెడాకు చెందిన నటాషా ఫాక్స్‌ను.. వినేశ్ 10-0 తేడాతో చిత్తు చేసింది. ఆరంభం నుంచే బౌట్లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన వినేశ్.. చివరకు విజేతగా నిలిచింది. కాగా, 23 ఏళ్ల వినేశ్.. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌లో తొలి గేమ్ నుంచే సత్తా చాటుతూ వస్తోంది. కాగా, తాజా విజయంతో వచ్చే నెలలో జరగబోయే ఏషియన్ గేమ్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతానని ఆమె తెలిపింది. ఈ టోర్నీ కోసం తనకు కోచ్‌గా వ్యవహరించిన వోల్లర్ అకోస్(హంగేరి)ని.. పర్సనల్ ట్రైనర్‌గా ఇండియాకు రావాల్సిందిగా వినేశ్ ఆహ్వానించింది. ఇదిలా ఉంటే ఆగష్టు 18 నుంచి జకార్త, పాలెంబ్యాంగ్లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. -
ఎదురులేని హామిల్టన్
బార్సిలోనా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో టైటిల్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది రెండో టైటిల్ కాగా కెరీర్లో 64వ విజయం. నాటకీయ పద్ధతిలో మొదలైన ఈ రేసులో తొలి ల్యాప్‌లోనే హాస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా...మరో డ్రైవర్ ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. సీజన్లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. -
హామిల్టన్‌కు ‘పోల్’
బార్సిలోనా: స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 19.149 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది మూడో ‘పోల్’ కావడం విశేషం. వెటెల్ (ఫెరారీ), బొటాస్ (మెర్సిడెస్), రైకోనెన్ (ఫెరారీ), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఎనిమిది, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.