రోస్‌బర్గ్ రెండోసారి...
- మెర్సిడెస్ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’
- నేడు జపాన్ గ్రాండ్‌ప్రి
సుజుకా (జపాన్): గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు నికో రోస్‌బర్గ్, లూయిస్ హామిల్టన్ మళ్లీ గాడిలో పడ్డారు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించగా... హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ ఇద్దరూ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది రెండో ‘పోల్ పొజిషన్’ కాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా రెండోసారి. క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.584 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బొటాస్ (విలియమ్స్) మూడో స్థానం నుంచి, ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్‌లో ఇప్పటికే 42 గ్రాండ్‌ప్రి టైటిల్స్ సాధించిన వెటెల్... గ్రిడ్ పొజిషన్స్‌లో టాప్-3లో లేకుండా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన వెటెల్ జపాన్‌లో ఏం చేస్తాడో వేచి చూడాలి. ఇక భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.
నేటి ప్రధాన రేసు
ఉదయం గం. 10.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం