హామిల్టన్ అదుర్స్ | Hamilton Adhurs | Sakshi
Sakshi News home page

హామిల్టన్ అదుర్స్

Published Sun, Sep 27 2015 11:49 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

హామిల్టన్ అదుర్స్ - Sakshi

హామిల్టన్ అదుర్స్

జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం  ఈ సీజన్‌లో ఎనిమిదో విజయం
 
సుజుకా (జపాన్): వారం రోజుల క్రితం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈసారి అద్వితీయ ప్రదర్శనతో పుంజుకున్నాడు. జపాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్‌లో తన ఖాతాలో ఎనిమిదో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 28 నిమిషాల 06.508 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానాన్ని సాధించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంతో సంతృప్తి పడ్డాడు.

తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో 277 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నికో రోస్‌బర్గ్ (229 పాయింట్లు), వెటెల్ (218 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ విజయంతో హామిల్టన్ ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 41 టైటిల్స్‌తో విఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్)తో కలిసి హామిల్టన్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్), అలైన్ ప్రాస్ట్ (51 టైటిల్స్), సెబాస్టియన్ వెటెల్ (42 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి అక్టోబరు 11న జరుగుతుంది.

 తొలి ల్యాప్‌లోనే ఆధిక్యంలోకి...
రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ తొలి ల్యాప్ మలుపులో ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్‌బర్గ్‌ను ఓవర్‌టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి హామిల్టన్ వెనుదిరిగి చూడలేదు. మధ్యలో రెండుసార్లు పిట్స్‌లో ఆగిన అతనికి ఏదశలోనూ మిగతా డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొన్న హామిల్టన్ తుదకు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

 గమ్యం చేరారిలా (టాప్-10)
 1. హామిల్టన్ (మెర్సిడెస్-1గం:28ని.06.508 సెకన్లు), 2. నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1గం:28ని.25.472 సెకన్లు), 3. వెటెల్ (ఫెరారీ-1గం:28ని.27.358 సెకన్లు), 4. రైకోనెన్ (ఫెరారీ-1గం: 28ని.40.276 సెకన్లు), 5. బొటాస్ (విలియమ్స్-1గం:28ని.43.254 సెకన్లు), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా-1గం:29ని.02.067 సెకన్లు), 7. గ్రోస్యెన్ (లోటస్-1గం:29ని.18.806 సెకన్లు), 8. మల్డొనాడో (లోటస్-1గం: 29ని.20.083 సెకన్లు), 9. వెర్‌స్టాపెన్ (ఎస్టీఆర్-1గం:29ని.41.823 సెకన్లు), 10. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్-ప్లస్ ఒక ల్యాప్).
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement