ఎదురులేని హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్‌లో తడబడినా... ప్రధాన రేసులో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 67 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానంతో ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ గంటా 30 నిమిషాల 44.200 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఆరో టైటిల్ కావడం విశేషం.
‘పోల్ పొజిషన్’తో రేసును మొదలెట్టిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో, వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ 217 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.