నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి
బార్సిలోనా : ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సంపాదించి దూకుడు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు సహచరుడు నికో రోస్‌బర్గ్ చెక్ పెట్టాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్‌లలో కలిపి రోస్‌బర్గ్ మొత్తం 18 ల్యాప్‌లు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఒక నిమిషం 24.681 సెకన్లలో అందరికంటే వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
హామిల్టన్ ఒక నిమిషం 24.948 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. మాజీ చాంపియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 17వ, సెర్గియో పెరెజ్ 18వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.
రోస్‌బర్గ్‌కు తొలి పోల్
Published Sun, May 10 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement
Advertisement