sergio perez
-
సెయింజ్‌కు ‘పోల్’
సింగపూర్: ఫార్ములావన్‌లో ఈ సీజన్లో తొలిసారి రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, సెర్జియో పెరెజ్ నిరాశపరిచారు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ 11వ స్థానంలో, పెరెజ్ 13వ స్థానంలో నిలిచారు. నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ 11వ స్థానం నుంచి, పెరెజ్ 13వ స్థానం నుంచి ప్రారంభిస్తారు. మరోవైపు ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 30.984 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును సెయింజ్ తొలి స్థానం నుంచి మొదలు పెడతాడు. ఈ సీజన్లో 14 రేసులు జరగ్గా... 14 రేసుల్లోనూ రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12 రేసుల్లో), పెరెజ్ (2 రేసుల్లో) విజేతలుగా నిలిచారు. -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్
సింగపూర్: రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో పెరెజ్ విజేతగా నిలిచాడు. 59 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్ అందరికంటే వేగంగా 2గం:02ని.15.238 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లెక్లెర్క్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో 11 విజయాలు సాధించిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది. -
‘మొనాకో’ విజేత పెరెజ్
మోంటెకార్లో: పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ రేసులో పెరెజ్ 64 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా గంటా 56 నిమిషాల 30.265 సెకన్లలో ముగించి ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. వర్షం కారణంగా 77 ల్యాప్‌ల రేసును 64 ల్యాప్‌లకు కుదించారు. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ముగ్గురు డ్రైవర్లు అల్బోన్ (విలియమ్స్ రేసింగ్), మిక్ షుమాకర్ (హాస్), మాగ్నుసన్ (హాస్) రేసును పూర్తి చేయలేకపోయారు. తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది. చదవండి: Chamundeswaranath: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు -
ఎట్టకేలకు పెరెజ్‌కు తొలి ఎఫ్1 టైటిల్
సాఖిర్ (బహ్రెయిన్): తన తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెక్సికో డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఎట్టకేలకు ఫార్ములావన్ (ఎఫ్1)లో తొలి టైటిల్‌ను సాధించాడు. సాఖిర్ గ్రాండ్‌ప్రి రేసులో 30 ఏళ్ల పెరెజ్ విజేతగా నిలిచాడు. 87 ల్యాప్‌ల ఈ రేసులో రేసింగ్ పాయింట్ జట్టు డ్రైవర్ పెరెజ్ అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 15.114 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2011లో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన పెరెజ్ తన కెరీర్‌లోని 190వ రేసులో విజేతగా నిలువడం విశేషం. సాఖిర్ గ్రాండ్‌ప్రిలో ఐదో స్థానం నుంచి రేసును ఆరంభించిన పెరెజ్ మిగతా డ్రైవర్ల తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకొని తొలి విజయం రుచి చూశాడు. కరోనా బారిన పడటంతో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ రేసులో పాల్గొనలేదు. హామిల్టన్ స్థానంలో మెర్సిడెస్ జట్టు రెండో డ్రైవర్‌గా బరిలోకి దిగిన జార్జి రసెల్ ఒకదశలో విజయం సాధించేలా కనిపించినా... కారు టైర్ పంక్చర్ కావడంతో 80వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. ఒకాన్ (రెనౌ), స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఎఫ్1 2020 సీజన్‌లోని చివరిదైన 17వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 13న జరుగుతుంది. -
పెరెజ్‌కు పాజిటివ్
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలు ఆలస్యంగా మొదలైన ఫార్ములావన్ (ఎఫ్1)లో ఎలాంటి ఆటంకం లేకుండా తొలి మూడు రేసులు సాఫీగా ముగిశాయి. కానీ నాలుగో రేసు సన్నాహాలు మొదలుకావడానికి ఒకరోజు ముందుగా కోవిడ్ –19 తొలి పాజిటివ్ కేసు నమోదైంది. రేసింగ్ పాయింట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెక్సికో డ్రైవర్ సెర్గియో పెరెజ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో అతను ఈనెల 2న, 9న జరగాల్సిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులకు దూరమయ్యాడు. ‘నేను చాలా నిరాశగా ఉన్నాను. నా కెరీర్‌లోని గడ్డురోజుల్లో ఇదొకటి. నా తల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో హంగేరి గ్రాండ్‌ప్రి రేసు ముగిశాక ప్రైవేట్ విమానంలో మెక్సికోకు వెళ్లాను. రెండు రోజులు అక్కడే ఉన్నాను. బహుశా నాకు కరోనా వైరస్ మెక్సికోలోనే సోకి ఉంటుంది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన వెంటనే నాకు పరీక్ష నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది. అయితే నాలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. ఇంగ్లండ్ కోవిడ్–19 నిబంధనల ప్రకారం నేను 10 రోజులు క్వారంటైన్లో ఉంటాను’ అని 30 ఏళ్ల పెరెజ్ అన్నాడు. 2014 నుంచి 2018 వరకు భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పెరెజ్... ఈ సీజన్లో జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి తొలి రెండు రేసుల్లోనూ ఆరో స్థానంలో నిలువగా... హంగేరి గ్రాండ్‌ప్రిలో ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బ్రిటిష్ గ్రాండ్‌ప్రికి పెరెజ్ దూరం కావడంతో అతని స్థానంలో జర్మనీ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్‌కు రేసింగ్ పాయింట్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం లభించింది. గత సీజన్లో రెనౌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హుల్కెన్బర్గ్ను ఈసారి ఆ జట్టు తప్పించింది. పెరెజ్ కరోనా బారిన పడ్డాడని తెలిసిన వెంటనే ఖాళీగా ఉన్న హుల్కెన్‌బర్గ్‌కు రేసింగ్ పాయింట్ టీమ్ ప్రిన్సిపల్ ఓట్మర్ ఫోన్ చేసి తమ జట్టు తరఫున డ్రైవింగ్ చేయాలని కోరాడు. దాంతో ఊహించని అవకాశం దక్కడంతో హుల్కెన్‌బర్గ్ వెంటనే జర్మనీ నుంచి ఇంగ్లండ్‌కు వచ్చేశాడు. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్నాడు. -
సూపర్ పెరెజ్
బాకు (అజర్బైజాన్): ఒకటా... రెండా... ఏకంగా 36 రేసుల తర్వాత భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఓ ఫార్ములావన్ రేసులో టాప్–3లో నిలిచాడు. ఆదివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి రేసులో ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని సంపాదించాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్ గంటా 43 నిమిషాల 48.315 సెకన్లలో పూర్తి చేశాడు. 2016లో బాకు వేదికగా జరిగిన యూరోపియన్ గ్రాండ్‌ప్రిలో చివరిసారి పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నాడు. హామిల్టన్ గంటా 43 నిమిషాల 44.291 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. -
దర్జా తగ్గని మాల్యా.. అక్కడా రేసు మొదలు
లండన్: భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చాలా రోజులకు కనిపించాడు. బ్రిటన్‌లోని ఫార్ములా వన్ రేస్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఫార్ములావన్ తన వెబ్సైట్లో పెట్టింది. సెర్జియో పెరెజ్, ఈస్టెబాన్ అనే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్జాగా ఫొటోలకు పోజులిచ్చాడు. బ్రిటన్‌లో నిర్వహించే ఫార్ములా వన్ రేస్‌లో మాల్యాకు చెందిన సహారా ఫోర్స్ ఇండియా కూడా పోటీ చేస్తుంది. దీని ప్రమోషన్లో భాగంగానే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్శనం ఇచ్చాడు. ఫార్ములా వన్ తన టీమ్‌కు చెందిన కొత్త కారును మాల్యా గురువారం సిల్వర్ స్టోన్లో ప్రారంభించనున్నాడు. దాదాపు రూ.9000కోట్లను ఆయా బ్యాంకుల్లో రుణంగా తీసుకొని ఎగ్గొట్టి బ్రిటన్‌కు మాల్యా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిపై భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టాయి. ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వంతో కూడా భారత అధికారులు చర్చలు చేపడుతున్నారు. తమ దేశంలో వేల కోట్లను ఎగ్గొట్టి మోసం చేసిన మాల్యాను తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేస్తోంది. మరోపక్క, తాజాగా మాల్యా కనిపించడంతో భారత్ మీడియా అతడిని తిట్ల వర్షంతో ట్విట్టర్లో దుమ్ముదులుపుతోంది. -
దర్జా తగ్గని మాల్యా.. అక్కడా రేసు మొదలు
-
'జపాన్ గ్రాండ్ ప్రిలో రాణిస్తా'
సుజుకా: ఈ వారాంతంలో ఆరంభం కానున్న జపాన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ లో మరింత రాణిస్తానని అంటున్నాడు భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ సెర్గియో పెరెజ్. ఇటీవల జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిలో ఏడో స్థానం సాధించి ఆకట్టుకున్న పెరెజ్.. తదుపరి గ్రాండ్ ప్రికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.సింగపూర్ గ్రాండ్ ప్రిలో మొత్తంగా మూడు పాయింట్లు సాధించిందుకు తనకు ఆనందంగా ఉందన్నాడు. అయితే జపాన్ గ్రాండ్ ప్రిలో మరింత రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. వరుసగా జరిగిన మూడు ఫార్ములావన్ రేసుల్లో తాను ఎంతో మెరుగైనట్లు 25 ఏళ్ల పెరెజ్ పేర్కొన్నాడు. మిగతా ఫార్ములావన్ తరహాలోనే జపాన్ గ్రాండ్ ప్రి కూడా ఉంటుందని.. అయితే ఇక్కడ ప్రజలు ఫార్ములావన్ అమితంగా ఇష్టపడతారన్నాడు. మనం చేసే పని మీద నిబద్ధతతో పాటు నమ్మకం కూడా విజయం తప్పకుండా వస్తుందని పెరెజ్ తెలిపాడు. ప్రస్తుతం 39 పాయింట్లతో ఉన్న పెరెజ్ డ్రైవర్ల స్టాండింగ్ లో 9వ స్థానంలో ఉన్నాడు. -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్
సింగపూర్ : క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెటెల్ రెండు గంటల 1ని:22.118 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 32 ల్యాప్‌ల తర్వాత కారులో ఇబ్బంది తలెత్తడంతో రేసు నుంచి వైదొలిగాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లలో సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 12వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ (252 పాయింట్లు), రోస్‌బర్గ్ (211), వెటెల్ (203) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
రోస్బర్గ్కు తొలి పోల్
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా : ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సంపాదించి దూకుడు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు సహచరుడు నికో రోస్‌బర్గ్ చెక్ పెట్టాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లలో కలిపి రోస్‌బర్గ్ మొత్తం 18 ల్యాప్‌లు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఒక నిమిషం 24.681 సెకన్లలో అందరికంటే వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ ఒక నిమిషం 24.948 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. మాజీ చాంపియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 17వ, సెర్గియో పెరెజ్ 18వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.