హామిల్టన్‌కు ‘పోల్’
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి
బార్సిలోనా: గత రెండు రేసుల్లో విఫలమైన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు.
ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది మూడో ‘పోల్’ కాగా... కెరీర్‌లో 52వది. సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.