రైట్ రైట్... రోస్‌బర్గ్
► రష్యా గ్రాండ్‌ప్రిలోనూ మెర్సిడెస్ డ్రైవర్ హవా
► సీజన్‌లో వరుసగా నాలుగో టైటిల్ సొంతం
సోచి (రష్యా): వేదిక మారినా... రేసు మారినా... ఫలితం మారలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ ఏడాది తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 41.997 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లోనూ రోస్‌బర్గ్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే.
ఓవరాల్‌గా రోస్‌బర్గ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. గతేడాది చివరి మూడు రేసుల్లోనూ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ ఈ సీజన్‌లో జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా ఏడు అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొం దాడు. గతంలో వెటెల్ (జర్మనీ) 2013లో వరుసగా తొమ్మిది రేసుల్లో గెలుపొందగా... షుమాకర్ , అస్కారి వరుసగా ఏడేసి రేసుల్లో నెగ్గారు. ఈ ముగ్గురి సరసన రోస్‌బర్గ్ చేరాడు.
ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ రేసులో ఆకట్టుకున్నాడు. పదో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన అతను రెండో స్థానాన్ని సంపాదించాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. రైకోనెన్ ఫలితంతో ఎఫ్1 చరిత్రలో 700సార్లు టాప్-3లో నిలిచిన జట్టుగా ఫెరారీ గుర్తింపు పొందింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పెరెజ్ తొమ్మిదో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది.