హామిల్టన్‌కు పదో టైటిల్
ఆస్టిన్: తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పదో విజయాన్ని సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ 56 ల్యాప్‌లను గంటా 40 నిమిషాల 04.785 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా కెరీర్‌లో 32వ టైటిల్.
ఈ గెలుపుతో ఫార్ములావన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన బ్రిటన్ డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు ఈ రికార్డు నెజైల్ మాన్సెల్ (31 విజయాలు) పేరిట ఉండేది. మరోవైపు హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ పదోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రోస్‌బర్గ్ 23 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే రోస్‌బర్గ్ వెన్నంటే నిలిచిన హామిల్టన్ 24వ ల్యాప్‌లో తన సహచరుడిని ఓవర్‌టేక్ చేస్తూ ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి దూకుడు పెంచిన హామిల్టన్ తుదకు ఐదు సెకన్ల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ ఇంజిన్ వైఫల్యంతో 16వ ల్యాప్‌లో వైదొలగగా... సెర్గియో పెరెజ్ తొలి ల్యాప్‌లోనే సాబెర్ జట్టు డ్రైవర్ సుటిల్ కారును ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు.
సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉన్నాయి. తదుపరి రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది. ఈనెల 23న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ఫార్ములావన్ సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం హామిల్టన్ 316 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ముందున్నాడు. రోస్‌బర్గ్ 292 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో రెండు రేసులు మిగిలి ఉన్న నేపథ్యంలో వీరిద్దరిలో ఒకరికి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కనుంది.
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు
1 హామిల్టన్ మెర్సిడెస్ 316
2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 292
3 రికియార్డో రెడ్‌బుల్ 214
4 బొటాస్ విలియమ్స్ 155
5 వెటెల్ రెడ్‌బుల్ 149
కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం జట్టు పాయింట్లు
1 మెర్సిడెస్ 608
2 రెడ్‌బుల్ 363
3 విలియమ్స్ 238
4 ఫెరారీ 196
5 మెక్‌లారెన్ 147
గమ్యం చేరారిలా...
స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు
1 హామిల్టన్ మెర్సిడెస్ 1:40:04.785 25
2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 1:40:09.099 18
3 రికియార్డో రెడ్‌బుల్ 1:40:30.345 15
4 మసా విలియమ్స్ 1:40:31.709 12
5 బొటాస్ విలియమ్స్ 1:40:35.777 10
6 అలోన్సో ఫెరారీ 1:41:40.016 8
7 వెటెల్ రెడ్‌బుల్ 1:41:40.519 6
8 మాగ్నుసెన్ మెక్‌లారెన్ 1:41:45.467 4
9 జీన్ వెర్జెన్ ఎస్టీఆర్ 1:41:48.648 2
10 మల్డొనాడో లోటస్ 1:41:52.655 1
నోట్: సమయం-గంటలు, నిమిషాలు, సెకన్లలో