రోస్‌బర్గ్ ‘ఏడోసారి’
- ఈ సీజన్‌లో మెర్సిడెస్ డ్రైవర్‌కు ఏడో పోల్
- హామిల్టన్‌కు రెండో స్థానం
- నేడు బెల్జియన్ గ్రాండ్ ప్రి
స్పా (బెల్జియం): ఫార్ములావన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఇది అతడికి వరుసగా నాలుగో పోల్ పొజిషన్ కావడం విశేషం. శనివారం అర్డెన్నెస్ ఫారెస్ట్‌లోని స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌పై జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో అతను అందరికంటే వేగంగా 2 నిమిషాల 5.698 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు.
వర్షం మధ్య సాగిన క్వాలిఫయింగ్‌లో మెర్సిడెస్ మరో డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (2 నిమిషాల 5.819 సెకన్లు) చివరి వరకు గట్టిపోటి ఇచ్చాడు. అయితే కారులో బ్రేక్ సమస్యలు రావడంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. జూన్‌లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి తర్వాత మళ్లీ మెర్సిడెజ్ డ్రైవర్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే మొదటిసారి. బెల్జియన్ గ్రాండ్ ప్రి డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్, అలోన్సో, రికియార్డో తర్వాతి మూడు స్థానాల్లో నిలిచారు.
నిరాశపర్చిన ‘ఫోర్స్’
క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు నిరాశపర్చారు. ఈ సీజన్‌లో హుల్కెన్‌బర్గ్ తొలిసారి క్వాలిఫయింగ్ తొలి దశలోనే వెనుదిరిగాడు. అయితే మరో డ్రైవర్ పెరెజ్.. క్యూ-2లో 2 నిమిషాల 10.084 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేయడంతో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు.