మోంట్రీల్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన కెనాడియన్ గ్రాండ్ ప్రిలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్ల రేసును ఒక గంటా 31 నిమిషాల 05.296 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించాడు. పోల్ పొజిషన్ తో ప్రధాన రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకుని విజయం సాధించాడు. ఇది హామిల్టన్ కెరీర్ లో 45వ విజయం. కాగా, అంతకుముందు ఈ ఏడాది జరిగిన మొనాకో గ్రాండ్ టైటిల్ ను గెలిచి వరుసగా రెండో విజయాన్ని హామిల్టన్ దక్కించుకోవడం విశేషం.
ఇదిలా ఉండగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ ఐదో స్థానానికి పరిమితం కాగా, ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ రెండో స్థానాన్ని సాధించాడు. మరోవైపు భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుకెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలవగా, సెర్గియో పెరెజ్ 11వ స్థానానికి పరిమితమయ్యాడు.ఈ విజయాన్ని ఇటీవల కన్నుమూసిన బాక్సింగ్ దిగ్గజం మొహ్మద్ అలీకి అంకితం ఇస్తున్నట్లు హామిల్టన్ ప్రకటించాడు.