హామిల్టన్ సరికొత్త చరిత్ర
సిల్వర్స్టోన్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో హామిల్టన్ విజయం సాధించి వరుసగా మూడు సార్లు బ్రిటీష్ గ్రాండ్ ప్రి గెలిచిన తొలి డ్రైవర్ గా రికార్డు సాధించాడు. 52 ల్యాప్ల రేసును హామిల్టన్ అందరి కంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఈ సీజన్లో నాల్గో విజయాన్ని హామిల్టన్ తన ఖాతాలో వేసుకోగా, వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. మరోవైపు బ్రిటీష్ గ్రాండ్ ప్రిని హామిల్టన్ ఓవరాల్గా నాలుగుసార్లు గెలిచి మాజీ ఫార్ములావన్ డ్రైవర్ నిజిల్ మేన్ సిల్ సరసన నిలిచాడు.
సొంతగడ్డపై జరిగిన ఈ రేసులో హామిల్టన్ దుమ్మురేపగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ పాయింట్లకు హామిల్టన్ మరింత దగ్గరగా వచ్చాడు. కేవలం రోస్ బర్గ్ కంటే నాలుగు పాయింట్లు మాత్రమే హామిల్టన్ వెనకబడ్డాడు. ఇదిలా ఉండగా, మ్యాక్స్ వెర్స్టాపెన్(రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన డేనియల్ రికార్డియో నాల్గో స్థానానికి పరిమితమై పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమయ్యాడు.