హామిల్టన్కే పోల్
సిల్వర్స్టోన్:ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్, మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ ఈ సీజన్లో ఆరో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బ్రిటీష్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్లో హామిల్టన్ 1:29:287 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచి పోల్ పొజిషన్ సాధించాడు.ఓవరాల్ గా ఇది హామిల్టన్ కెరీర్లో 55వ పోల్ పొజిషన్. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. ఇదిలా ఉండగా, హామిల్టన్ కంటే 0:319 సెకన్లు వెనుకబడ్డ అతని సహచరుడు నికో రోస్బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ తొమ్మిది ఫార్ములావన్ రేసులో జరగ్గా అందులో రోస్ బర్గ్ ఐదింటిని, హామిల్టన్ మూడింటిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 153 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, హామిల్టన్ 142 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు స్పెయిన్ గ్రాండ్ ప్రి విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, డానియల్ రికార్డో(రెడ్ బుల్) నాల్గో స్థానంలో సాధించారు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుల్కెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ పదకొండో స్థానాలకు పరిమితమయ్యారు.