మళ్లీ... రోస్‌బర్గ్
సీజన్‌లో ఐదో ‘పోల్ పొజిషన్’
హామిల్టన్‌కు నిరాశ నేడు జర్మనీ గ్రాండ్‌ప్రి
టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు
హాకెన్‌హీమ్: సొంతగడ్డపై స్వదేశీ అభిమానులు ఏం ఆశించారో అదే చేసి చూపించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.540 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
మరోవైపు రోస్‌బర్గ్ సహచరుడు హామిల్టన్‌కు పూర్తి వ్యతిరేక ఫలితం వచ్చింది. రెండు వారాల క్రితం సొంతగడ్డపై బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గి జోష్ మీద ఉన్న ఈ బ్రిటన్ డ్రైవర్‌కు జర్మనీ క్వాలిఫయింగ్ సెషన్ కలసిరాలేదు. తొలి సెషన్‌లో ఐదు ల్యాప్‌లు పూర్తి చేశాక హామిల్టన్ కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. అప్పటికి గంటకు 165 కి.మీ.వేగంతో డ్రైవ్ చేస్తున్న హామిల్టన్ నియంత్రణ కోల్పోయి నేరుగా తన కారును గోడకు ఢీ కొట్టాడు. దాంతో సర్క్యూట్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది.
రేసు సిబ్బంది హామిల్టన్ వద్దకు చేరుకొని అతణ్ని వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అతని మోకాళ్లను పరీక్షించారు. అయితే హామిల్టన్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హామిల్టన్ ప్రస్తుతం 161 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. రోస్‌బర్గ్ 165 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ 9వ స్థానం నుంచి... పెరెజ్ 10వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. గతేడాది విజేత వెటెల్ ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు.