సింగపూర్: తాజా ఫార్ములావన్ సీజన్‌లో ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ హ్యాట్రిక్ పోల్స్‌తో అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ లో అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 36.217 సెకన్లలో చుట్టేసి పోల్ పొజిషన్‌ను సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును లెక్‌లెర్క్ మొదటి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.191 సెకన్ల తేడాతో ల్యాప్‌ను ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీకే చెందిన మరో డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో, రెడ్ బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ నాలుగు, మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ ఐదు స్థానాల్లో నిలిచారు. తాజా పోల్ పొజిషన్‌తో లెక్‌లెర్క్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పోల్ పొజిషన్స్ (5) సాధించిన డ్రైవర్‌గా అవతరించాడు. హామిల్టన్ (4) రెండో స్థానంలో ఉన్నాడు. చివరి రెండు రేసులను పోల్ పొజిషన్ నుంచి ఆరంభించి విజేతగా నిలిచిన లెక్‌లెర్క్... సింగపూర్ గ్రాండ్‌ప్రిలో కూడా విజేతగా నిలుస్తాడో? లేదో?.. చూడాలి. ప్రధాన రేసు నేటి సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment