Mercedes drivers
-
బొటాస్‌కు పోల్ పొజిషన్
నూర్బర్గ్ (జర్మనీ): మెర్సిడెస్ డ్రైవర్లు మరోసారి సత్తా చాటారు. వరుసగా 11వ రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వాల్తెరి బొటాస్... అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.269 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. తాజా సీజన్లో బొటాస్‌కు ఇది మూడో ‘పోల్’ కావడం విశేషం. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. మరో వైపు ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్ ప్రి విజయాల (91 టైటిల్స్) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న లూయిస్ హామిల్టన్... ల్యాప్‌ను 0.256 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. అనారోగ్యంతో రేసిం గ్ పాయింట్ డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌తో పాటు ప్రధాన రేసుకు కూడా దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని నికో హల్కెన్‌బర్గ్ (జర్మనీ)తో రేసింగ్ పాయింట్ టీమ్ భర్తీ చేసింది. క్వాలిఫయింగ్ సెషన్లో హల్కెన్‌బర్గ్ 20వ స్థానంలో నిలిచి రేసును అందరికంటే చివరగా ఆరంభించనున్నాడు. సీజన్ ఆరంభంలో హల్కెన్‌బర్గ్ రేసింగ్ పాయింట్ తరఫున పాల్గొన్నాడు. -
విజయంతో ముగించాడు
అబుదాబి: పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించి... అదే జోరును చివరి ల్యాప్ వరకు కొనసాగించి... మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 2019 ఫార్ములావన్ సీజన్‌ను విజయంతో ముగించాడు. ఆదివారం జరిగిన సీజన్లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో 34 ఏళ్ల హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 55 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో... లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కెరీర్లో 88వ సారి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్ ఈ సీజన్లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీజన్లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్–326 పాయింట్లు) రెండో స్థానంలో ... వెర్స్టాపెన్ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. ►3 ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్ సాధించాయి. ►5 ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్ సాధించగలిగారు. హామిల్టన్ 11 టైటిల్స్ నెగ్గాడు. బొటాస్ 4 టైటిల్స్, వెర్స్టాపెన్ 3 టైటిల్స్, లెక్లెర్క్ 2 టైటిల్స్, వెటెల్ ఒక టైటిల్ గెలిచారు. -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత బొటాస్
సుజుకా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 12 రేసుల అనంతరం మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మరో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అందరి కంటే ముందుగా గంటా 21 నిమిషాల 46.755 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వెటెల్ రెండో స్థానంలో... మరో మెర్సిడెస్ డ్రెవర్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ రేసుతో మెర్సిడెస్ జట్టు మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే 2019 కన్స్ట్రక్టర్స్ టీమ్ టైటిల్‌ను దక్కించుకుంది. -
హామిల్టన్‌ను గెలిపించిన ఫెరారీ
సోచి: గెలవాల్సిన రేసును బంగారు పళ్లెంలో పెట్టి మెర్సిడెస్కు అప్పగించింది ఫెరారీ. ప్రత్యర్థి పేలవ రేసు వ్యూహాన్ని అనుకూలంగా మార్చుకున్న మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఈ సీజన్లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఆరోసారి ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌గా అవతరించడానికి మరింత దగ్గరయ్యాడు. ఆదివారం 53 ల్యాప్‌ల ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 38.992 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ 3.829 సెకన్ల వెనుకగా రేసును ముగించి రెండో స్థానంలో నిలువగా... పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రేసు మధ్యలోనే వైదొలిగాడు. రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, ఆల్బన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అందరి కంటే చివరగా... పిట్లేన్ నుంచి రేసును ఆరంభించిన ఆల్బన్ అద్భుతమైన డ్రైవింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం డ్రైవర్ ఛాంపియన్ షిప్ లో హామిల్టన్ 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 73 పాయింట్ల తేడాతో బొటాస్ రెండో స్థానంలో ఉన్నాడు. తదుపరి గ్రాండ్‌ప్రి అక్టోబర్ 13న జపాన్‌లో జరుగుతుంది. -
లెక్లెర్క్ హ్యాట్రిక్ పోల్స్
సింగపూర్: తాజా ఫార్ములావన్ సీజన్లో ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ హ్యాట్రిక్ పోల్స్‌తో అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ లో అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 36.217 సెకన్లలో చుట్టేసి పోల్ పొజిషన్‌ను సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ మొదటి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.191 సెకన్ల తేడాతో ల్యాప్‌ను ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీకే చెందిన మరో డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో, రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ నాలుగు, మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ ఐదు స్థానాల్లో నిలిచారు. తాజా పోల్ పొజిషన్‌తో లెక్లెర్క్ ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పోల్ పొజిషన్స్ (5) సాధించిన డ్రైవర్‌గా అవతరించాడు. హామిల్టన్ (4) రెండో స్థానంలో ఉన్నాడు. చివరి రెండు రేసులను పోల్ పొజిషన్ నుంచి ఆరంభించి విజేతగా నిలిచిన లెక్లెర్క్... సింగపూర్ గ్రాండ్‌ప్రిలో కూడా విజేతగా నిలుస్తాడో? లేదో?.. చూడాలి. ప్రధాన రేసు నేటి సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానుంది. -
మళ్లీ... రోస్‌బర్గ్
సీజన్లో ఐదో ‘పోల్ పొజిషన్’ హామిల్టన్‌కు నిరాశ నేడు జర్మనీ గ్రాండ్‌ప్రి టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు హాకెన్‌హీమ్: సొంతగడ్డపై స్వదేశీ అభిమానులు ఏం ఆశించారో అదే చేసి చూపించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.540 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మరోవైపు రోస్‌బర్గ్ సహచరుడు హామిల్టన్‌కు పూర్తి వ్యతిరేక ఫలితం వచ్చింది. రెండు వారాల క్రితం సొంతగడ్డపై బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గి జోష్ మీద ఉన్న ఈ బ్రిటన్ డ్రైవర్‌కు జర్మనీ క్వాలిఫయింగ్ సెషన్ కలసిరాలేదు. తొలి సెషన్లో ఐదు ల్యాప్‌లు పూర్తి చేశాక హామిల్టన్ కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. అప్పటికి గంటకు 165 కి.మీ.వేగంతో డ్రైవ్ చేస్తున్న హామిల్టన్ నియంత్రణ కోల్పోయి నేరుగా తన కారును గోడకు ఢీ కొట్టాడు. దాంతో సర్క్యూట్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. రేసు సిబ్బంది హామిల్టన్ వద్దకు చేరుకొని అతణ్ని వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అతని మోకాళ్లను పరీక్షించారు. అయితే హామిల్టన్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హామిల్టన్ ప్రస్తుతం 161 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. రోస్‌బర్గ్ 165 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ 9వ స్థానం నుంచి... పెరెజ్ 10వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. గతేడాది విజేత వెటెల్ ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు.