Germany grandprix
-
హామిల్టన్‌కు 87వ ‘పోల్’
హాకెన్‌హీమ్ (జర్మనీ): ఈ సీజన్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.767 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఈ సీజన్లో పది రేసులు జరగ్గా... ఏడింటిలో హామిల్టనే విజేత. మరో రెండు రేసుల్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నెగ్గగా... మరోదాంట్లో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ వెటెల్ తొలి క్వాలిఫయింగ్ సెషన్‌ను దాటలేకపోయాడు. ఆదివారం జరిగే రేసును అతను చివరిదైన 20వ స్థానం నుంచి మొదలు పెడతాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. పియరీ గాస్లీ (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (అల్ఫా రోమియో), 6. గ్రోస్యెన్ (హాస్), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 9. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 10. లెక్లెర్క్ (ఫెరారీ), 11. గియోవినాజి (అల్ఫా రోమియో), 12. మాగ్నుసెన్ (హాస్), 13. రికియార్డో (రెనౌ), 14. క్వియాట్ (ఎస్టీఆర్), 15. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 16. లాండో నోరిస్ (మెక్లారెన్), 17. అలెగ్జాండర్ ఆల్బోన్ (ఎస్టీఆర్), 18. జార్జి రసెల్ (విలియమ్స్), 19. రాబర్ట్ కుబికా (విలియమ్స్), 20. వెటెల్ (ఫెరారీ). సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
వారెవ్వా... హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్ సెషన్లో నిరాశపరిచినప్పటికీ ప్రధాన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేశాడు. 14వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏకంగా విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ 67 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 29.845 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్‌కు మూడో స్థానం లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ జట్టు మరో డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ 51వ ల్యాప్‌లో వైదొలిగాడు. కారుపై నియంత్రణ కోల్పోయిన వెటెల్ ట్రాక్ గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. రేసు ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 53వ ల్యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై దూసుకొచ్చినందుకు విచారణకు హాజరు కావాలని హామిల్టన్‌కు స్టీవార్డ్స్ నోటీసులు జారీ చేశారు. అయితే హామిల్టన్ ఉద్దేశపూర్వకంగా తాను అలా చేయలేదని ఇచ్చిన వివరణపట్ల సంతృప్తి చెందిన స్టీవార్డ్స్ అతడిని హెచ్చరికతో వదిలిపెట్టారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోయుంటే హామిల్టన్ టైటిల్ కోల్పోయేవాడు. -
మళ్లీ... రోస్‌బర్గ్
సీజన్లో ఐదో ‘పోల్ పొజిషన్’ హామిల్టన్‌కు నిరాశ నేడు జర్మనీ గ్రాండ్‌ప్రి టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు హాకెన్‌హీమ్: సొంతగడ్డపై స్వదేశీ అభిమానులు ఏం ఆశించారో అదే చేసి చూపించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.540 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మరోవైపు రోస్‌బర్గ్ సహచరుడు హామిల్టన్‌కు పూర్తి వ్యతిరేక ఫలితం వచ్చింది. రెండు వారాల క్రితం సొంతగడ్డపై బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గి జోష్ మీద ఉన్న ఈ బ్రిటన్ డ్రైవర్‌కు జర్మనీ క్వాలిఫయింగ్ సెషన్ కలసిరాలేదు. తొలి సెషన్లో ఐదు ల్యాప్‌లు పూర్తి చేశాక హామిల్టన్ కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. అప్పటికి గంటకు 165 కి.మీ.వేగంతో డ్రైవ్ చేస్తున్న హామిల్టన్ నియంత్రణ కోల్పోయి నేరుగా తన కారును గోడకు ఢీ కొట్టాడు. దాంతో సర్క్యూట్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. రేసు సిబ్బంది హామిల్టన్ వద్దకు చేరుకొని అతణ్ని వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అతని మోకాళ్లను పరీక్షించారు. అయితే హామిల్టన్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హామిల్టన్ ప్రస్తుతం 161 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. రోస్‌బర్గ్ 165 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ 9వ స్థానం నుంచి... పెరెజ్ 10వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. గతేడాది విజేత వెటెల్ ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు.