రోస్‌బర్గ్‌కు ‘పోల్’
తొలి రెండు గ్రిడ్‌లు మెర్సిడెస్‌వే
నేడు మొనాకో గ్రాండ్‌ప్రి
మోంటెకార్లో: ఈ సీజన్ ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయిస్తున్న మెర్సిడెస్ జట్టు మొనాకో గ్రాండ్‌ప్రిలోనూ విజయంపై దృష్టి సారించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 15.989 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.
అయితే ల్యాప్ చివర్లో ఈ జర్మన్ డ్రైవర్ చేసిన పొరపాటు అతని సహచరుడు లూయిస్ హామిల్టన్ ‘పోల్’ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ల్యాప్ ముగిసే సమయంలో రోస్‌బర్గ్ అదుపుతప్పి ట్రాక్ దాటి వేరే మార్గంలో వెళ్లిపోయి తిరిగి వెనక్కి వచ్చాడు. దాంతో నిర్వాహకులు ప్రమాద సూచికగా పసుపు జెండాను ప్రదర్శించారు. దాంతో నిబంధనల ప్రకారం... రోస్‌బర్గ్ వెనకాలే వేగంగా దూసుకొస్తున్న హామిల్టన్ తన కారును నెమ్మదించాల్సి వచ్చింది. దాంతో అతను క్వాలిఫయింగ్ చివరి ల్యాప్‌లో తన సమయాన్ని మెరుగుపర్చుకోలేకపోయాడు. చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రోస్‌బర్గ్ వ్యవహరించిన తీరుపై స్టీవార్డ్స్ విచారణ చేపట్టారు.
దాంతో ‘పోల్ పొజిషన్’ ఫలితం తారుమారు అవుతుందా అనే అనుమానం కలిగింది. అయితే విచారణ అనంతరం స్టీవార్డ్స్ రోస్‌బర్గ్‌పై చర్య తీసుకోకపోడంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ జర్మన్ డ్రైవరే తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 10వ స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. రోస్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగానే ట్రాక్ నుంచి పక్కదారి పట్టాడా లేదా అనే విషయంపై వ్యాఖ్యానించేందుకు అతని సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరాకరించాడు. చివరి ల్యాప్‌లో తాను దూకుడు మీద ఉన్నానని... రోస్‌బర్గ్ పొరపాటు చేయకపోయుంటే తనకూ ‘పోల్ పొజిషన్’ అవకాశం దక్కేదని గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ అన్నాడు.