దుమ్మురేపిన రోస్ బర్గ్
మెక్సికో: గత 23 ఏళ్ల అనంతరం తొలిసారి మెక్సికోలో జరిగిన మెక్సికన్ గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ దుమ్మురేపాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 42 నిమిషాల 35.038 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, సహచరుడు లూయిస్ హమిల్టన్(మెర్సిడెస్) ను బోల్తా కొట్టించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. రోస్ బర్గ్ కంటే ఒక నిమిషం 954 సెకన్ల వెనుకబడ్డ హమిల్టన్ రెండో స్థానంలో నిలవగా.. విలియమ్స్ జట్టు డ్రైవర్ బోటాస్ మూడో స్థానం సాధించాడు. కాగా, భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఆకట్టుకుంది. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో నిలువగా, మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ ప్రధాన రేసును మొదటి స్థానం నుంచి ఆరంభించగా.. హమిల్టన్ రెండో స్థానం నుంచి ప్రధాన రేసును ప్రారంభించాడు. ఆదివారం రాత్రి జరిగిన ప్రధాన రేసులో రోస్ బర్గ్ -హమిల్టన్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాగా, 51వ ల్యాప్ వద్ద హమిల్టన్ ను దాటుకుని ముందుకు దూసుకుపోయిన రోస్ బర్గ్ అదే పరంపరను చివరి వరకూ కొనసాగించి మెక్సికన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ లో రోస్ బర్గ్ సాధించిన టైటిల్ సంఖ్య నాలుగుకు చేరగా, ఓవరాల్ గా అతని కెరీయర్ లో 12 వ టైటిల్ వచ్చి చేరింది. ఈ సీజన్ లో గత జూన్ 21 వ తేదీన జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి సాధించిన తరువాత రోస్ బర్గ్ కు ఇదే తొలి టైటిల్. ఈ సీజన్ లో స్పానిష్ గ్రాండ్ ప్రి, మొనాకో గ్రాండ్ ప్రి, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి, మెక్సికన్ గ్రాండ్ ప్రి టైటిళ్లను రోస్ బర్గ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
క్వాలిఫయింగ్ రేసులో రోస్ బర్గ్ ఒక నిమిషం 19.480 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసుకుని పోల్ పొజిషన్ సాధించాడు. దీంతో రోస్ బర్గ్ ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించాడు. రోస్ బర్గ్ కంటే 0.188 సెకన్ల వెనుకబడ్డ హమిల్టన్ రెండో స్ధానంతో రేసును మొదలు పెట్టాడు.
అంతకుముందు సెప్టెంబర్ లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రి తరువాత హమిల్టన్ పోల్ పొజిషన్ సాధించలేదు.
గడిచిన మూడు రేసుల్లో రోస్ బర్గ్ పోల్ పొజిషన్ సాధించినా.. ప్రధాన రేసుకు వచ్చేసరికి హమిల్టన్ చేతిలో భంగపడ్డాడు.