రోస్‌బర్గ్ ‘హ్యాట్రిక్’
మొనాకో గ్రాండ్‌ప్రిలో టైటిల్ సొంతం
మోంటెకార్లో : నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ రేసర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచి అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. 65 ఏళ్ల చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసును వరుసగా మూడేళ్లు సాధించిన నాలుగో డ్రైవర్‌గా నిలిచాడు. గతంలో అయర్టన్ సెనా, అలైన్ ప్రాస్ట్, గ్రాహమ్ హిల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. 78 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 49 నిమిషాల 18.420 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ-1:49:22.906) రెండో స్థానంలో నిలువగా... ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్-1:49:24.473) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలిచాడు. రేసులో 63వ ల్యాప్ వరకు హామిల్టన్ ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకోవడంతో సేఫ్టీ కారును రప్పించారు. అదే సమయంలో హామిల్టన్‌ను పిట్ స్టాప్‌లో ఆగాలని జట్టు ఆదేశించింది. అప్పటికే రెండో స్థానంలో ఉన్న రోస్‌బర్గ్, మూడో స్థానంలో ఉన్న వెటెల్ ముందుకు దూసుకుపోయారు.