రోస్ బర్గ్ రెండో హ్యాట్రిక్
సింగపూర్: సీజన్ ఆరంభంలో జోరు కనబరిచి... ఆ తర్వాత తడబడి... మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ తన ఖాతాలో ఎనిమిదో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 55 నిమిషాల 48.950 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. రికియార్డో రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజా విజయంతో ఈ సీజన్‌లో రోస్‌బర్గ్ వరుసగా మూడు టైటిల్స్‌ను రెండోసారి సాధించనట్టయింది.
సీజన్ ఆరంభంలో జరిగిన నాలుగు రేసుల్లోనూ రోస్‌బర్గ్ గెలుపొందగా... గత రెండు రేసులు ఇటలీ, బెల్జియం గ్రాండ్‌ప్రిల్లోనూ అతనికే టైటిల్ లభించింది. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో రోస్‌బర్గ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. ప్రస్తుతం రోస్‌బర్గ్ ఖాతాలో 273 పాయింట్లు, హామిల్టన్ ఖాతాలో 265 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు సింగపూర్ రేసులో భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలను అందించింది. సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే కారుపై నియంత్రణ కోల్పోయి గోడకు ఢీకొట్టి రేసు నుంచి నిష్కమ్రించాడు. సీజన్‌లోని తదుపరి రేసు మలేసియా గ్రాండ్‌ప్రి అక్టోబరు 2న జరుగుతుంది.
గమ్యం చేరారిలా (టాప్-10): 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1:55:48.950 సెకన్లు), 2. రికియార్డో (రెడ్‌బుల్-1:55:49.438 సె), 3. హామిల్టన్ (మెర్సిడెస్-1:55:56.988 సె), 4. రైకోనెన్ (ఫెరారీ-1:55:59.169 సె), 5. వెటెల్ (ఫెరారీ-1:56:16.644 సె), 6. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్-1:57:00.147 సె), 7. అలోన్సో (మెక్‌లారెన్-1:57:18.148 సె), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1:57:40.012 సె), 9. క్వియాట్ (ఎస్టీఆర్-1:57:40.507 సె), 10. మాగ్నుసెన్ (రెనౌ-1:57:48.902 సె).