రోస్బర్గ్ 'హ్యాట్రిక్'
* చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
* సీజన్‌లో వరుసగా మూడో విజయం
షాంఘై (చైనా): క్వాలిఫయింగ్ సెషన్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ వరుసగా మూడో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ 56 ల్యాప్‌లను గంటా 38 నిమిషాల 53.891 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం.
ఓవరాల్‌గా వరుసగా అతనికిది ఆరో టైటిల్. గతేడాది చివరి మూడు రేసుల్లో (మెక్సికో, బ్రెజిల్, అబుదాబి గ్రాం డ్‌ప్రి) నెగ్గిన రోస్‌బర్గ్ ఈ ఏడాది జరిగిన తొలి మూడు రేసుల్లోనూ (ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా) టైటిల్ సాధించడం విశేషం. చివరి స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానాన్ని సంపాదించాడు. వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... క్వియాట్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు నిరాశన మిగిల్చింది. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ టాప్-10 నిలువడంలో విఫలమయ్యారు. పెరెజ్ 11వ స్థానంలో, హుల్కెన్‌బర్గ్ 15వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రోస్‌బర్గ్ 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హామిల్టన్ 39 పాయింట్లతో రెండో స్థానంలో, రికియార్డో 36 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి మే 1వ తేదీన జరుగుతుంది.