ఏడు రేసుల తర్వాత మళ్లీ...
హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’
నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి
మోంజా (ఇటలీ): సీజన్ ఆరంభంలో మెరిపించి ఆ తర్వాత తడబడిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఏడు రేసుల తర్వాత మరోసారి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.109 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు.
మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభిస్తాడు. 220 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో ఆధిక్యంలో ఉన్న రోస్‌బర్గ్ గత 12 రేసుల్లో నిలకడగా రాణించాడు. నాలుగు రేసుల్లో విజేతగా నిలువడమేకాకుండా ఆరు రేసుల్లో రెండో స్థానాన్ని సంపాదించాడు.
ఇటలీలో ఈ ఇద్దరు మెర్సిడెస్ డ్రైవర్ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుదనడంలో సందేహం లేదు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. ‘ఫోర్స్’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 10వ స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఎస్టీఆర్ జట్టు డ్రైవర్ క్వియాట్ క్వాలిఫయింగ్‌లో 11వ స్థానాన్ని పొందినా... నిబంధనలకు విరుద్ధంగా ఇంజిన్‌ను మార్చడంతో అతనిపై 10 గ్రిడ్‌ల పెనాల్టీ పడింది. దాంతో అతను ప్రధాన రేసును 21వ స్థానం నుంచి మొదలుపెడతాడు.
ఇటలీ గ్రాండ్‌ప్రి వివరాలు
ల్యాప్‌ల సంఖ్య: 53
సర్క్యూట్ పొడవు: 5.793 కి.మీ.
రేసు దూరం: 306.720 కి.మీ.
మలుపుల సంఖ్య: 11
ల్యాప్ రికార్డు: 1ని:21.046 సెకన్లు
(బారిచెల్లో-2004)
ప్రధాన రేసు
నేటి సాయంత్రం గం. 5.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం