ఎదురులేని హామిల్టన్
వరుసగా నాలుగోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సిల్వర్‌స్టోన్: క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసులోనూ తన ఆధిపత్యం చలాయించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మెరిశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఐదోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన అతను బ్రిటిష్ గ్రాండ్‌ప్రిని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన జిమ్ క్లార్క్ (బ్రిటన్) రికార్డును సమం చేశాడు. ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసును ప్రారంభించిన హామిల్ట న్ నిర్ణీత 51 ల్యాప్‌లను గంటా 21 నిమిషాల 27.430 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది నాలుగో విజయం.
ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన హామిల్టన్‌కు తన ప్రత్యర్థుల నుంచి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాలను దక్కించుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది.