
రోస్‌బర్గ్‌కు ‘పోల్’
నేడు కెనడా గ్రాండ్‌ప్రి
మాంట్రియల్: రెండు వారాల క్రితం మొనాకో గ్రాండ్‌ప్రిలో సాధించిన విజయంతో జోరు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే దూకుడును కెనడాలోనూ కొనసాగించాడు. ఈ సీజన్‌లో మూడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 14.874 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. రోస్‌బర్గ్ సహచరుడు లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు.
డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్‌లు వరుసగా 11వ, 13వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే టైటిల్ లభించింది. మరోసారి గ్రిడ్ పొజిషన్స్‌లో తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ డ్రైవర్లకే దక్కడంతో వారి ఖాతాలో వరుసగా ఏడో టైటిల్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.