హామిల్టన్ దూకుడు | hamilton fast | Sakshi
Sakshi News home page

హామిల్టన్ దూకుడు

Published Sun, Mar 15 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

హామిల్టన్ దూకుడు

హామిల్టన్ దూకుడు

‘పోల్ పొజిషన్’తో సీజన్ మొదలు నేడు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి
 
మెల్‌బోర్న్: గతేడాది ఏకంగా 11 విజయాలతో స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త సీజన్‌ను పూర్తి విశ్వాసంతో ప్రారంభించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 26.327 సెకన్లలో పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

కెరీర్‌లో 39వ సారి ‘పోల్ పొజిషన్’ సంపాదించిన హామిల్టన్ ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిని నాలుగోసారి ‘పోల్ పొజిషన్’తో ఆరంభించనున్నాడు. గతంలో మూడుసార్లు విఫలమైన అతను నాలుగోసారైనా సఫలమవుతాడో లేదో వేచి చూడాలి. గతేడాది ‘పోల్ పొజిషన్’తోనే ఈ రేసును ప్రారంభించిన హామిల్టన్ నాలుగు ల్యాప్‌ల తర్వాత సాంకేతిక కారణాలతో రేసు నుంచి వైదొలిగాడు. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి... విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.

ఈ సీజన్‌లో ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగుతున్న ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా 14వ, 15వ స్థానాల నుంచి బరిలోకి దిగుతారు. ‘క్వాలిఫయింగ్‌లో రాణించడంతో సీజన్‌లో శుభారంభం లభించింది. తొలి రేసులో నెగ్గకపోయినా ప్రపంచమేమీ అంతం కాదని గత సీజన్‌లో నేను నిరూపించాను. కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు ‘పోల్ పొజిషన్’ తొలి అడుగులాంటిది’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు.
 
 గ్రిడ్ పొజిషన్స్
 
 స్థానం     డ్రైవర్               జట్టు

 1        హామిల్టన్        మెర్సిడెస్
 2        రోస్‌బర్గ్          మెర్సిడెస్
 3         మసా          విలియమ్స్
 4        వెటెల్             ఫెరారీ
 5       రైకోనెన్            ఫెరారీ    
 6       బొటాస్          విలియమ్స్
 7      రికియార్డో         రెడ్‌బుల్
 8      సెయింజ్          ఎస్టీఆర్
 9      గ్రోస్యెన్             లోటస్
 10    మల్డొనాడో        లోటస్
 11      నాసర్           సాబెర్
 12    వెర్‌స్టాపెన్        ఎస్టీఆర్
 13    క్వియాట్        రెడ్‌బుల్
 14    హుల్కెన్‌బర్గ్    ఫోర్స్ ఇండియా
 15      పెరెజ్           ఫోర్స్ ఇండియా
 16     ఎరిక్సన్          సాబెర్
 17     బటన్           మెక్‌లారెన్
 18    మాగ్నుసెన్     మెక్‌లారెన్
 
 ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి వివరాలు
 ల్యాప్‌ల సంఖ్య:         58
 సర్క్యూట్ పొడవు:    5.303 కి.మీ.
 రేసు దూరం:          307.574 కి.మీ.
 మలుపుల సంఖ్య:    16
 ల్యాప్ రికార్డు:          1ని:24.125 సెకన్లు         (షుమాకర్-2004లో)
 గతేడాది విజేత:       రోస్‌బర్గ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement