సాక్షి, అమరావతి: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ఆభా) కార్డుల జారీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ కృషి చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వాములు కావాలని చెప్పారు. ఆభా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ డిజిటల్ యుగం వైపు దేశం దూసుకుపోతున్న తరుణంలో వైద్య, ఆరోగ్య రంగం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాలకు వెళ్లిన వైద్యులు ప్రజలకు అందించే వైద్య సేవలను వారి ఆభా ఐడీలకు అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఎక్కడికి వెళ్లినా వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలిసిపోతుందని, సత్వర వైద్యం అందించేందుకు దోహదపడుతుందని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ప్రత్యేకాధికారి బీవీ రావు, డాక్టర్ కోటిరెడ్డి, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment