ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు ఇవ్వాలని, క్యూ ఆర్ కోడ్‌తో వీటిని జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్ చేయగానే సంబంధిత కార్డుదారుడికి ఓటీపీ నెంబర్ వచ్చేలా ఉండాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 104, 108 వాహనాలు కొత్తవి కొనుగోలు చేయాలని, సెప్టెంబర్ చివరికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం సూచనలు చేశారు. వైద్య చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2020 జనవరి 1 నుంచి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆదేశించారు. పథకాన్ని మూడు నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం చేసిన తర్వాత క్రమంగా అన్ని జిల్లాలకు వర్తింప చేస్తామని వివరించారు.
సదుపాయాలను బట్టి ఆస్పత్రుల కేటగిరీలు
ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకునే నెట్వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. థర్డ్ పార్టీతో ఆస్పత్రులను తనిఖీలు చేయిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. నాణ్యమైన వసతులు, సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులను ‘ఏ ప్లస్’, ‘ఏ’ కేటగిరీలో చేర్చాలని, నామమాత్రంగా ఉన్నవాటిని ‘బి’ కేటగిరీలో ఉంచి మెరుగైన వసతులు కల్పించేందుకు గడువు ఇవ్వాలని సీఎం సూచించారు. మళ్లీ తనిఖీలు చేసినప్పుడు లోపాలుంటే నెట్వర్క్ జాబితా నుంచి తొలగించాలని, ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆస్పత్రులను ‘సి’ కేటగిరీలో చేర్చి వాటిని జాబితా నుంచి పూర్తిగా లేకుండా చేయాలన్నారు.
ఏపీ వెలుపల 150 ఆస్పత్రుల్లో..
కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సుమారు 150 ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఈ ఆస్పత్రుల సేవలను నవంబర్ మొదటి వారం నుంచి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి చర్యలు
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ‘ఏ ప్లస్’ కేటగిరీలోకి తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఆస్పత్రుల్లో ఫొటోలు తీసి చేపట్టాల్సిన పనులను ప్రాధాన్య క్రమంలో నిర్ణయించాలన్నారు. మందులు, రక్తపరీక్షల కోసం ఎవరూ ఆస్పత్రినుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని సీఎం ఆదేశించారు. పరికరాల నిర్వహణ టెండరులో ఒక షరతుగా ఉండాలని, దీనివల్ల ప్రతి ఆస్పత్రిలో పరికరాలు సక్రమంగా పని చేస్తాయన్నారు. 2021 సెప్టెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైఎస్సార్ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో 5 క్యాన్సర్ ఆస్పత్రులు
రాష్ట్రంలో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులను కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్లు, కళ్లద్దాలు అవసరమైన వారిని గుర్తించి వైద్యసేవలు అందించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా తదితరులు ఉన్నారు.
సీఎంను కలసిన నిపుణుల కమిటీ
వైద్య శాఖలో సంస్కరణలపై నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. కమిటీ చైర్పర్సన్ సుజాతారావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి పలు అంశాలను తెచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి, రోగులకు అందుతున్న సేవలు, పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) అమలుపై వివరించింది. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను పకడ్బందీగా అమలు చేయటంపై నివేదించింది. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ తెలిపింది.
పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. కొత్తగా 3 మెడికల్ కాలేజీలు, పేద రోగులకు అండగా ఉండేందుకు 5 క్యాన్సర్ ఆస్పత్రులు, 2 కిడ్నీ ఆస్పత్రుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను, 108, 104 సర్వీసులను మెరుగు పరుస్తున్నామని తెలిపారు.
– డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలో హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ
– క్యూ ఆర్ కోడ్‌తో ప్రతి కుటుంబానికి కార్డు జారీ
– చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి
– పశ్చిమ గోదావరి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా జనవరి 1 నుంచి ప్రారంభం
– క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరణ
– మెరుగైన సదుపాయాలు కల్పించే ఆస్పత్రులు ‘ఏ ప్లస్’, ‘ఏ’ కేటగిరీలోకి
– ఏపీ వెలుపల 150 ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపు
– హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో నవంబర్ నుంచి మొదలు
– అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు