పురుషులు ఎక్కువ సంఖ్యలో రుణాలు తీసుకున్నట్లు వెల్లడి
అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: అప్పులు, చేబదుళ్ల వంటివి చేసే వారిలో తెలంగాణ ప్రజలు దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. లక్షమందికి గాను సగటున 42,407 మంది ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచో, మరో రూపంలోనో అప్పులు తీసుకున్నట్టు వెల్లడైంది. అప్పులు తీసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయానికొస్తే...లక్ష మందికి గాను సగటున 60,092 మంది రుణాలు తీసుకుని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. లక్ష మందికి గాను 35,703 మంది రుణం తీసుకోవడం ద్వారా తమిళనాడు ప్రజలు మూడో స్థానంలో నిలిచారు.
కాంప్రహెన్సి యాన్యువల్ మాడ్యులర్ సర్వే (సీఏఎంఎస్)–2022–23 (2022 జూలై నుంచి 2023 జూన్ దాకా)కు సంబంధించిన వివరాలను కేంద్ర అర్థ గణాంకాల శాఖ విడుదల చేసింది. తెలంగాణలో అప్పులు తీసుకున్న వారిలో పురుషులు 54,538, మహిళలు 30,287 ఉన్నట్టుగా సర్వేలో వెల్లడైంది. రూ.500 లేదా ఆపై మొత్తాన్ని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తీసుకుని ఈ సర్వే నిర్వహించేనాటికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే ఆ వ్యక్తిని రుణగ్రస్తునిగా (ఇన్‌డెబ్టెడ్) పరిగణనలోకి తీసుకున్నారు. అఖిల భారత స్థాయిలో 3,02,086 కుటుంబాలకు చెందిన (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) 12,99,988 మంది నుంచి అప్పుల వివరాలు సేకరించారు.
జాతీయ సగటుకు మించి పట్టభద్రులు
తెలంగాణకు సంబంధించి సర్వే వెల్లడించిన ఇతర అంశాలను పరిశీలిస్తే..21 ఏళ్లు ఆ పైబడిన వయసు వారు జాతీయ సగటు కంటే ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీలలో పట్టభద్రులుగా ఉన్నారు. 62.3 శాతం మంది సైన్స్, టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్. అదే ఏపీలో 58.5 శాతం మంది మాత్రమే ఈ సబ్జెక్ట్‌లలో పట్టభద్రులు. సైన్స్, టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్ అయిన వారిలో పురుషులు 61.6 శాతం, మహిళలు 63.6 శాతం ఉన్నారు. వీరి శాతం కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధికం.
దేశవ్యాప్తంగా ఇతర గణాంకాల విషయానికొస్తే...
15–24 ఏళ్ల మధ్యనున్న వారిలో 96.9 శాతం మంది ఏదైనా ప్రకటనను చదివి, రాయగలుగుతున్నారు. సాధారణ లెక్కలు చేయగలుగుతున్నారు. వీరిలో పురుషులు–97.8%, మహిళలు–95.9%. 18 ఏళ్లు ఆపై వయసున్న వారిలో అఖిల భారత స్థాయిలో 94.6% మంది ఏదైనా బ్యాంక్‌లో లేదా ఆర్థిక సంస్థలో ఖాతా కలిగి ఉన్నారు. దేశంలో 92.3 శాతం మంది మొబైల్ ఫోన్లు (స్మార్ట్‌ఫోన్లతో సహా) వాడుతున్నారు.–ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారు 64.8% మంది. ఏదైనా సమాచారం కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేయడంతో పాటు ఈ–మెయిల్స్ పంపగలిగినవారు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలా పాలు నిర్వహించగలిగినవారు 39.4% ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment