ఒకే ఒక్కడు... | Hamilton takes record-breaking 92nd win with dominant drive in Portuguese GP | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు...

Published Tue, Oct 27 2020 6:24 AM | Last Updated on Tue, Oct 27 2020 6:24 AM

Hamilton takes record-breaking 92nd win with dominant drive in Portuguese GP - Sakshi

ట్రాక్‌పై అందరికంటే ముందుగా దూసుకెళుతున్న హామిల్టన్‌, ట్రోఫీతో సంబరం

పోర్టిమావో (పోర్చుగల్‌): ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తెరమరుగైంది. గత ఏడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్‌లో 92వ విజయం నమోదు చేశాడు. ఈ క్రమంలో 91 విజయాలతో జర్మనీ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న రికార్డును 35 ఏళ్ల హామిల్టన్‌ బద్దలు కొట్టాడు. 2007లో తొలి ఎఫ్‌1 విజయం సాధించిన హామిల్టన్‌ 2013లో మెర్సిడెస్‌ జట్టులో చేరాడు.

మెర్సిడెస్‌ జట్టులో షుమాకర్‌ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్‌ అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. షుమాకర్‌ ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ (సీజన్‌ ఓవరాల్‌ విన్నర్‌) ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండగా... ఈ ఏడాదీ హామిల్టన్‌కే ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా ఈ సీజన్‌లో మరో ఐదు రేసులు ముగిశాక షుమాకర్‌ పేరిట ఉన్న ఈ రికార్డునూ హామిల్టన్‌ సమం చేసే చాన్స్‌ ఉంది. 2006లో చైనా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత షుమాకర్‌ అదే ఏడాది ఎఫ్‌1కు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని ఎఫ్‌1లో పునరాగమనం చేసిన షుమాకర్‌ 2012 వరకు మెర్సిడెస్‌ జట్టుతో కొనసాగినా మరో రేసులో గెలుపొందలేకపోయాడు.  

ఆరంభంలో వెనుకబడ్డా...
24 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగిన పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌ ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ప్రారంభించాడు. అయితే రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్‌ జట్టుకే చెందిన బొటాస్‌ మొదట్లోనే హామిల్టన్‌ను ఓవర్‌టేక్‌ చేశాడు. అయితే 20వ ల్యాప్‌లో హామిల్టన్‌ ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత అదే జోరును చివరిదైన 66వ ల్యాప్‌ వరకు కొనసాగించాడు. చివరకు గంటా 29 నిమిషాల 56.828 సెకన్లలో రేసును ముగించిన హామిల్టన్‌ కెరీర్‌లో 92వ విజయాన్ని దక్కించుకున్నాడు. బొటాస్‌కు రెండో స్థానం లభించగా... వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) మూడో స్థానాన్ని పొం దాడు.  ప్రస్తుత సీజన్‌లోని 17 రేసుల్లో 12 పూర్తయ్యాయి. తదుపరి రేసు ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి ఇటలీలో నవంబర్‌ 1న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్‌ చాంపియన్‌ షిప్‌ రేసులో హామిల్టన్‌ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బొటాస్‌ (179 పాయింట్లు), వెర్‌స్టాపెన్‌ (162 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.  కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్‌ 435 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement