
Saudi Arabian Formula One Grand Prix 2024- జెద్దా: ఫార్ములావన్ తాజా సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ వరుసగా రెండో రేసులోనూ టైటిల్ సాధించాడు. సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 50 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా 1 గంట 20 నిమిషాల 43.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్ చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని తన కెరీర్‌లో 56వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలోనూ వెర్‌స్టాపెన్ నెగ్గాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది.
పోరాడి ఓడిన శ్రీజ
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ మాన్యు (చైనా)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 50వ ర్యాంకర్ శ్రీజ 6–11, 11–9, 5–11, 11–8, 8–11తో పోరాడి ఓడిపోయింది.
మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 4–11, 11–7, 9–11, 11–9, 10–12తో జియోజిన్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్ క్వాలిఫయింగ్‌లో విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment