కలసపాడు పోలీసు స్టేషన్
2016 మార్చి 19న పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో బ్రాహ్మణపల్లెకు చెందిన సూదా తిరుపతిరెడ్డి అనే ఖాతాదారుడిని ఏమార్చి రూ.4.30లక్షల క్యాష్‌బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొద్దుటూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఎస్‌ఐ వెంకటరమణ వారంరోజుల్లో దొంగలను పట్టుకుంటానని చెప్పారు. రెండేళ్లు అయినా దొంగల జాడలేదు. పోయిన సొమ్ము రికవరీ లేదు.
2016 జూలై 22వ గిద్దలూరు ప్రధాన రహదారిలో ఉన్న నాలుగు ఇళ్లలో, పోలీస్‌శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న మరియన్న ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లారు. కేసు నమోదు చేయమని బాధితులు ఎస్‌ఐని అడిగితే ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు బాధితులు పోరుమామిళ్ల సీఐని సంప్రదించారు. సీఐతో చివాట్లు తిన్న ఎస్‌ఐ తర్వాత కేసు నమోదు చేశారని తెలిసింది. అయితే ఇంతవరకు దొంగలు దొరకలేదు. సొత్తు రికవరీ కాలేదు.
ఇలా కలసపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల పదికిపైగా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతవరకు వాటిపై కేసులు లేవు.. రికవరీ లేదు. బాధితులు స్టేషన్‌వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
కలసపాడు : ఒక పుస్తెల గొలుసు సమకూర్చుకోవడం ఓ కూలీ కుటుంబానికి ఎవరెస్టు శిఖరం ఎక్కినంత కష్టం. మధ్యతరగతి వారు జీవితాంతం కష్టపడితేగానీ నాలుగు తులాల బంగారం సమకూర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి కుటుంబాల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి దోచుకుని పండుగ చేసుకుంటున్నారు దొంగలు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళుతున్నా తమ మెడకు మరో కేసు చుట్టుకుంటుందని భావించే పోలీసులు బాధితులపై చిందులేసి తరుముతున్నారే తప్ప కేసులు నమోదు చేయడం లేదు. ఇదీ కలసపాడు పోలీసుస్టేషన్ తీరు.
ఒక పోలీసుస్టేషన్ పనితీరును జిల్లా ఉన్నతాధికారులు గుర్తించాలంటే దాని పరిధిలో కేసుల నమోదు, పెండింగ్ కేసుల ఆధారంగా బేరీజు వేస్తుండంటంతో తమకు భారంగా తోచే ఏ కేసునైనా కలసపాడు పోలీసులు ఆదిలోనే తుంగలో తోక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది కలసపాడులో దాదాపు పదికిపైగా చోరీలు జరిగితే స్టేషన్‌లో నమోదైంది మాత్రం ఒక్కటే కేసు. కేసులు తక్కువ ఉన్న పోలీస్‌స్టేషన్లు ఉన్నతాధికారుల దృష్టిలో బాగా పనిచేస్తున్నట్లు. కానీ కలసపాడులో జరగుతుంది వేరు. స్టేషన్‌లో రికవరీ కేసులు ఏమీ నమోదు చేయడంలేదు. అంతేగాకుండా తనకు భారంగా తోచే ఏ కేసునూ ఎస్‌ఐ నమోదు చేయడం లేదు.
గ్రామాల్లో గస్తీ తిరుగుతున్న ప్రజలు
ఇటీవల దొంగలు తిరుగుతున్నారంటూ గ్రామాల్లో ప్రచారం ఎక్కువైంది. దీంతో ఆయా గ్రామాల్లోని యువత కర్రలు చేతపట్టుకుని రాత్రిపూట గస్తీ తిరగడం ప్రారంభించారు. పోలీసులు మాత్రం గ్రామాలకు వెళ్లడం గానీ.. మేమున్నామన్న ధైర్యం చెప్పడంగానీ చేయలేదు సరికదా దొంగల గురించి ఎవరైనా వాట్సాప్‌ల్లో ప్రజలకు సమాచారం అందిస్తే వారిని పట్టుకుని హింసించడం ఒక పనిగా పెట్టుకున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
వరుస ఘటనలతో వణుకుతున్న ప్రజలు
ఇటీవల వరుసగా దొంగతనాలు గ్రామస్తులకు నిద్ర లేకుండా చేశాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధిలో ఒకరి ఇంట్లో, శివాలయంలో, పెండ్లిమర్రి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో, లింగారెడ్డిపల్లె బాలింతమ్మ గుడిలో, నల్లగొండు పల్లె పోలేరమ్మ గుడిలో, ఇటీవల ముద్దిరెడ్డిపల్లెలోని మూడు ఇళ్లలో, కాశినాయన మండలం నరసాపురంలోని బ్రహ్మంగారిగుడిలో చోరీలు జరిగాయి. 20రోజుల కిందట పెండ్లిమర్రి సమీపంలోని ఆంజన్న గుడిలో పూజారిపై దొంగలు దాడి చేసి అతనిని గాయపరిచి పరారయ్యారు. ఇన్ని ఘటనలు జరిగినా ఒక్క కేసు నమోదు చేయలేదు. కలసపాడు స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగడం లేదని ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పోలీసు అనిపించుకునేందుకు ఎస్‌ఐ ఆరాటపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. సొత్తు పోగొట్టుకున్న బాధితులు మాత్రం బాధలు అనుభవిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న ఈ రోజుల్లో నేరం చేసిన వ్యక్తి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేదని నేర సమీక్షల్లో ఉన్నత అధికారులు తరచూ చెబుతుంటారు. కానీ కలసపాడు ఎస్‌ఐ.వెంకటరమణకు ఇవేవి వంటపట్టినట్లులేదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ, నచ్చని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల అదుపులో ఉన్న యువకులు విడుదల
కాశినాయన : నకిలీ నోట్లు ఉన్నాయని కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణ మండల కేంద్రమైన నరసాపురానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కలసపాడు మండలం రామాపురానికి చెందిన తిరుపతిరెడ్డి అనే వ్యక్తి గతంలో నకిలీ నోట్ల కేసులో అరెస్టు అయ్యాడు. అతను చెప్పిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రెండు రోజుల నుంచి విచారణ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా నరసాపురం గ్రామానికి వెళ్లి ఓ ముద్దాయి ఇంటిని సోదా చేశారు. అక్కడ ఏమీ దొరకలేదు. నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయ్యేనా అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. గతంలో నకిలీ నోట్ల కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి చెబితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు అంటున్నారు. వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు వదిలేశారు. ఈ విషయమై కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణను వివరణ కోరగా వారిని విచారించామని, వారి వద్ద నకిలీ నోట్లు లేవని తెలిసి వదిలేశామని సమాధానమిచ్చారు.
ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి
దొంగతనం కేసులు ఒకటి రెండు బుక్ అయిన విషయం నిజమే. అలాగే కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే సంఘటనలు అన్నీ తెలుస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి కూడా పోయాయి. టైం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. బాధితులకు న్యాయం చేస్తాం.– మధుసూదన్ గౌడ్, సీఐ పోరుమామిళ్ల
Comments
Please login to add a commentAdd a comment