gold recovery
-
సొత్తు మాయం.. రికవరీ మేమెరుగం
2016 మార్చి 19న పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్‌లో బ్రాహ్మణపల్లెకు చెందిన సూదా తిరుపతిరెడ్డి అనే ఖాతాదారుడిని ఏమార్చి రూ.4.30లక్షల క్యాష్‌బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొద్దుటూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఎస్ఐ వెంకటరమణ వారంరోజుల్లో దొంగలను పట్టుకుంటానని చెప్పారు. రెండేళ్లు అయినా దొంగల జాడలేదు. పోయిన సొమ్ము రికవరీ లేదు. 2016 జూలై 22వ గిద్దలూరు ప్రధాన రహదారిలో ఉన్న నాలుగు ఇళ్లలో, పోలీస్‌శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న మరియన్న ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లారు. కేసు నమోదు చేయమని బాధితులు ఎస్ఐని అడిగితే ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు బాధితులు పోరుమామిళ్ల సీఐని సంప్రదించారు. సీఐతో చివాట్లు తిన్న ఎస్ఐ తర్వాత కేసు నమోదు చేశారని తెలిసింది. అయితే ఇంతవరకు దొంగలు దొరకలేదు. సొత్తు రికవరీ కాలేదు. ఇలా కలసపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల పదికిపైగా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతవరకు వాటిపై కేసులు లేవు.. రికవరీ లేదు. బాధితులు స్టేషన్‌వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కలసపాడు : ఒక పుస్తెల గొలుసు సమకూర్చుకోవడం ఓ కూలీ కుటుంబానికి ఎవరెస్టు శిఖరం ఎక్కినంత కష్టం. మధ్యతరగతి వారు జీవితాంతం కష్టపడితేగానీ నాలుగు తులాల బంగారం సమకూర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి కుటుంబాల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి దోచుకుని పండుగ చేసుకుంటున్నారు దొంగలు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళుతున్నా తమ మెడకు మరో కేసు చుట్టుకుంటుందని భావించే పోలీసులు బాధితులపై చిందులేసి తరుముతున్నారే తప్ప కేసులు నమోదు చేయడం లేదు. ఇదీ కలసపాడు పోలీసుస్టేషన్ తీరు. ఒక పోలీసుస్టేషన్ పనితీరును జిల్లా ఉన్నతాధికారులు గుర్తించాలంటే దాని పరిధిలో కేసుల నమోదు, పెండింగ్ కేసుల ఆధారంగా బేరీజు వేస్తుండంటంతో తమకు భారంగా తోచే ఏ కేసునైనా కలసపాడు పోలీసులు ఆదిలోనే తుంగలో తోక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది కలసపాడులో దాదాపు పదికిపైగా చోరీలు జరిగితే స్టేషన్లో నమోదైంది మాత్రం ఒక్కటే కేసు. కేసులు తక్కువ ఉన్న పోలీస్స్టేషన్లు ఉన్నతాధికారుల దృష్టిలో బాగా పనిచేస్తున్నట్లు. కానీ కలసపాడులో జరగుతుంది వేరు. స్టేషన్లో రికవరీ కేసులు ఏమీ నమోదు చేయడంలేదు. అంతేగాకుండా తనకు భారంగా తోచే ఏ కేసునూ ఎస్ఐ నమోదు చేయడం లేదు. గ్రామాల్లో గస్తీ తిరుగుతున్న ప్రజలు ఇటీవల దొంగలు తిరుగుతున్నారంటూ గ్రామాల్లో ప్రచారం ఎక్కువైంది. దీంతో ఆయా గ్రామాల్లోని యువత కర్రలు చేతపట్టుకుని రాత్రిపూట గస్తీ తిరగడం ప్రారంభించారు. పోలీసులు మాత్రం గ్రామాలకు వెళ్లడం గానీ.. మేమున్నామన్న ధైర్యం చెప్పడంగానీ చేయలేదు సరికదా దొంగల గురించి ఎవరైనా వాట్సాప్‌ల్లో ప్రజలకు సమాచారం అందిస్తే వారిని పట్టుకుని హింసించడం ఒక పనిగా పెట్టుకున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. వరుస ఘటనలతో వణుకుతున్న ప్రజలు ఇటీవల వరుసగా దొంగతనాలు గ్రామస్తులకు నిద్ర లేకుండా చేశాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధిలో ఒకరి ఇంట్లో, శివాలయంలో, పెండ్లిమర్రి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో, లింగారెడ్డిపల్లె బాలింతమ్మ గుడిలో, నల్లగొండు పల్లె పోలేరమ్మ గుడిలో, ఇటీవల ముద్దిరెడ్డిపల్లెలోని మూడు ఇళ్లలో, కాశినాయన మండలం నరసాపురంలోని బ్రహ్మంగారిగుడిలో చోరీలు జరిగాయి. 20రోజుల కిందట పెండ్లిమర్రి సమీపంలోని ఆంజన్న గుడిలో పూజారిపై దొంగలు దాడి చేసి అతనిని గాయపరిచి పరారయ్యారు. ఇన్ని ఘటనలు జరిగినా ఒక్క కేసు నమోదు చేయలేదు. కలసపాడు స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగడం లేదని ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పోలీసు అనిపించుకునేందుకు ఎస్ఐ ఆరాటపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. సొత్తు పోగొట్టుకున్న బాధితులు మాత్రం బాధలు అనుభవిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న ఈ రోజుల్లో నేరం చేసిన వ్యక్తి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేదని నేర సమీక్షల్లో ఉన్నత అధికారులు తరచూ చెబుతుంటారు. కానీ కలసపాడు ఎస్ఐ.వెంకటరమణకు ఇవేవి వంటపట్టినట్లులేదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ, నచ్చని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న యువకులు విడుదల కాశినాయన : నకిలీ నోట్లు ఉన్నాయని కలసపాడు ఎస్ఐ వెంకటరమణ మండల కేంద్రమైన నరసాపురానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కలసపాడు మండలం రామాపురానికి చెందిన తిరుపతిరెడ్డి అనే వ్యక్తి గతంలో నకిలీ నోట్ల కేసులో అరెస్టు అయ్యాడు. అతను చెప్పిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రెండు రోజుల నుంచి విచారణ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా నరసాపురం గ్రామానికి వెళ్లి ఓ ముద్దాయి ఇంటిని సోదా చేశారు. అక్కడ ఏమీ దొరకలేదు. నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయ్యేనా అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. గతంలో నకిలీ నోట్ల కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి చెబితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు అంటున్నారు. వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు వదిలేశారు. ఈ విషయమై కలసపాడు ఎస్ఐ వెంకటరమణను వివరణ కోరగా వారిని విచారించామని, వారి వద్ద నకిలీ నోట్లు లేవని తెలిసి వదిలేశామని సమాధానమిచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి దొంగతనం కేసులు ఒకటి రెండు బుక్ అయిన విషయం నిజమే. అలాగే కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే సంఘటనలు అన్నీ తెలుస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి కూడా పోయాయి. టైం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. బాధితులకు న్యాయం చేస్తాం.– మధుసూదన్ గౌడ్, సీఐ పోరుమామిళ్ల -
శుక్రవారం ఒక్కరోజే 3.24 కోట్లు స్వాధీనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కూడా రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో రూ.3.24 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొళకాల్మూరు వద్ద ఓ స్కార్పియో వాహనంలో రూ.2.17 కోట్లను గుర్తించారు. కోలారు సమీపంలో లారీలో సిమెంట్ సంచుల్లో తరలిస్తున్న రూ.70 లక్షల నగదును జప్తు చేశారు. బాగల్కోట్లో రూ.20 లక్షలు, బెంగళూరు శివారు ప్రాంతంలో రూ.17 లక్షల నగదు పట్టుబడింది. దీంతో ఇప్పటి వరకు పోలీసులు, ఎన్నికల ప్రత్యేక బృందాలు రూ.55 కోట్ల నగదు, సుమారు 8 వేల లీటర్ల మద్యం, సుమారు 100 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. -
ఆమె.. సామాన్యురాలు కాదు!
హత్నూర(సంగారెడ్డి) : బంగారం దొంగిలించిన కేసులో అంతర్ రాష్ట్ర మహిళా సభ్యురాలిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హత్నూర మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేష్నాయక్లు వివరాలు వెల్లడించారు. కర్నూల్ జిల్లా బుదారంపేట గ్రామానికి చెందిన అక్షంతల సంధ్య అలియాస్ దివ్య భర్త గణేష్, అలియాస్ రఘుతోపాటు సంధ్యకు సోదరి అయిన జ్యోతి కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కాలనీలో ఈ ఇద్దరు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నారన్నారు. సోమవారం సంధ్య, జ్యోతి ఇద్దరు కలిసి దౌల్తాబాద్ నుంచి సిరిపుర వెళ్లే ఆటోలో ఎక్కి ఓ వృద్ధురాలి బ్యాగ్‌లో నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించింది. ఈ క్రమంలో దేవులపల్లి బస్టాప్ సమీపంలో పోలీసులు ఆటోను చెక్ చేస్తున్న సమయంలో సంధ్య పట్టుపడినట్లు తెలిపారు. ఈ నెల 24న బోర్పట్ల, కోయూర్లో బంగారు ఆభరణాలు చోరీ చేశారని, 28న పటాన్చెరు, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23న చోరీలకు పాల్పడినట్లు వీరిపై కేసులు ఉన్నాయన్నారు. 2017లోనూ పటాన్చెరులో కేసులు ఉండగా ఇంకా నడుస్తున్నాయన్నారు. 2016 భువనగిరిలో చోరీ కేసు, 2017 కూకట్‌పల్లిలో మూడు కేసులు, 2015 రామచంద్రాపురం, శామీర్‌పేట పోలీస్టేషన్లో కూడా బంగారం చోరీ కేసులు సంధ్య, జ్యోతిలపై నమోదైనట్లు తెలిపారు. రాజమండ్రిలో హత్య కేసులో ఈ ఇద్దరు మహిళలు జైలుకు వెళ్లినట్లు సీఐ వివరించారు. కొన్ని సంవత్సరాలుగా బంగారు ఆభరణాలు వేసుకొని బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేసి ఈ ఇద్దరు చోరీలకు పాల్పడుతున్నారని వివరించారు. నిందితురాలు సంధ్య నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశామని విలేకర్లకు చూపారు. ఇంకా ఐదు తులాల బంగారు ఆభరణాలు జ్యోతి వద్ద ఉన్నాయని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని సీఐ వివరించారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యురాలిని పట్టుకున్నందుకు ఎస్సై రాజేష్‌నాయక్‌ను, సిబ్బందిని అభినందించారు. నిందితురాలిని కోర్టుకు పంపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సైరాజేష్నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
నమ్మకంగా వచ్చి..బంధువు ఇంట్లోనే చోరీ
ఒంగోలు క్రైం: దూరపు బంధువని ఇంటికి రానిస్తే..ఆ ఇంటికే కన్నం వేసిన సంఘటన ఒంగోలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎన్.సురేష్‌కుమార్‌రెడ్డి మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటకు చెందిన షేక్ గాలీబ్‌బీ ఈ నెల 4వ తేదీన ఒంగోలు నగరంలోని మరాఠిపాలెంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. బంధువులైన పఠాన్ మస్తాన్ దూరపు బంధువని ఇంట్లో ఉంచి మర్యాదలు చేశారు. అయితే తన దొంగ బుద్ధి పోనిచ్చుకోని గాలీబ్‌బీ బెడ్రూమ్లో ఉన్న బీరువా తాళాలు అపహరించి బీరువా లాకర్లోని సుమారు 14 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించింది. ఆమె ఇంటి నుంచి వెళ్లిన తరువాత చూసుకుంటే బీరువాలోని ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పఠాన్ మస్తాన్ ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై బి.శ్రీకాంత్ సిబ్బందితో దర్యాప్తు చేశారు. దీంతో గాలీబ్‌బీపై అనుమానంతో మంగళవారం ఉదయం అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆమెను గుర్తించి పట్టుకుని విచారించడంతో బంగారు ఆభరణాల గుట్టు వెల్లడించిందన్నారు. దీంతో ఆభరణాలను స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. చాకచక్యంగా మహిళా దొంగను పట్టుకున్నందుకు సిబ్బందిని ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. -
అంతర్ జిల్లాల దోపిడీ ముఠా అరెస్టు
కాకినాడ రూరల్: ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో వివిధ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను, బంగారం కొనుగోలు చేసిన నరసాపురానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి వీరి నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారు, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విశాల్ గున్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగతనాలకు పాల్పడిన ముఠా వివరాలను వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు 2015 నుంచి ఇప్పటి వరకు 18 దొంగతనాలు, 3 దోపిడీలు చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల బంగారం, 37 కిలోల వెండి, రూ. 3, 04, 700 నగదుతో కలిపి మొత్తం రూ. 50 లక్షలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.రాజోలు సీఐకి బుధవారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు శివకోడు ముసలమ్మ తల్లిగుడి వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పాలకొల్లు నుంచి రాజోలు వస్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై వ్యాన్‌ను చుట్టుముట్టి ఆపి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన సమాచారం బయటపడిందన్నారు. రాజోలు ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు ఇంట్లో దోపిడీ కేసుతో పాటు రాజోలు సర్కిల్లో మరో ఆరు దొంగతనాలు, అమలాపురం టౌన్లో గత నెల 7వ తేదీన జరిగిన సంచలనమైన దొంగతనంతో పాటు అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో ఏడు దొంగతనాలు, రావులపాలెం సర్కిల్ పరిధిలో మూడు, పెద్దాపురం సర్కిల్ పరిధిలో రెండు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సర్కిల్ పరిధిలో ఒకటి, పాలకొల్లు సర్కిల్ పరిధిలో ఒకటి, విశాఖ జిల్లా రూరల్ పరిధిలో దొంగతనాలకు, దోపిడీలకు ఈ ముగ్గురు సభ్యుల ముఠా పాల్పడిందన్నారు. ఈ ముఠాలో పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మట్లపాలెంకు చెందిన తోటకూర రామకృష్ణంరాజు అలియాస్ రాజేష్, తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామానికి చెందిన నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అలియాస్ మహేష్ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ విశాఖ జిల్లా నర్సిపట్నంలో ఉంటున్నాడు. అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామానికి చెందిన రుద్రరాజు వెంకటరాజు అలియాస్ నాని ఇతను ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఉంటున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. అంతేగాక వీరు దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేస్తున్న నరసాపురానికి చెందిన విజయ పవార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో రాజోలు సీఐ కిష్టోఫర్, సిబ్బంది బొక్కా శ్రీను, పి.వెంకటేశ్వర్లు, జయరాం, వీరేంద్ర, సుబ్బారావు, రామచంద్రరావు ఈ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. మూడేళ్లుగా భారీ దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను చాకచక్యంతో పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. ఈ దోపిడీ ముఠాను పట్టుకోవడంలో సహకరించిన అమలాపురం సబ్ డివిజన్ సీఐ వైఆర్కే శ్రీనివాస్, దేవకుమార్, పెద్దిరాజు, రమణారావును ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. -
విలాసాల కోసం చోరీల బాట
ఏడుగురు యువకుల అరెస్ట్ రూ.10 లక్షల బంగారు ఆభరణాల స్వాధీనం కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : వారందరూ యువకులు.. ఇంటర్ చదివారు.. సినిమాల ప్రభావంతో విలాస వంత మైన జీవితానికి అలవాటు పడ్డారు. కష్టపడకుండా అడ్డదారిన డబ్బు సంపాదించాలనే అత్యాశతో చోరీల బాట పట్టారు.. కాకినాడ సిటీ పరిధిలో ఏడు నెలలుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళలను తాళ్లతో బంధించి, కంట్లో కారం కొట్టి.. బంగారాన్ని దోచుకుపోతున్నారు. బైక్‌లపై పరారయ్యే వీరు.. అడ్డొచ్చిన వారిపై నిర్దాక్షిణ్యంగా దాడులకు పాల్పడ్డారు. ఈ చోరీలకు పాల్పడుతున్న ఏడుగురిని ఎట్టకేలకు కాకినాడ టూటౌ¯ŒS క్రైం పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 38 కాసుల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. టూటౌ¯ŒS క్రైం పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ వివరాలను వెల్లడించారు. ఏడుగురిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు రామారావు, రవికుమార్, హెచ్‌సీ గోవిందరావు, పీసీలు చిన్న, శ్రీరామ్, వర్మ, అజయ్, బాబు, రాములకు ఎస్పీ రవిప్రకాశ్ త్వరలో రివార్డులను అందించనున్నట్టు తెలిపారు. వరుస చోరీల చిట్టా... ఈ నిందితులు వరసగా చేసిన చోరీల వివరాలను ఏఎస్పీ వివరించారు. ఆయన కథనం ప్రకారం ఇలా ఉంది. కాకినాడ భానుగుడి సెంటర్ కృష్ణా లాడ్జి పక్కన కొప్పర్తి తిరుపతమ్మ ఇంట్లోని పని మనిషి కాలపురెడ్డి కృష్ణవేణికి నడకుదురుకు చెందిన యువకుడు తమరాన అశోక్‌కుమార్‌తో పరిచయం ఉంది. సెల్ఫో¯ŒS కొనుగోలుకు అతడు రూ.5 వేలు కృష్ణవేణిని అడిగితే పనిచేసే ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రోత్సహించింది. అన్నమ్మఘాటీకి చెందిన పైలా మõßహేష్తో కలసి సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి తిరుపతమ్మను గాయపరిచి ఆమె మెడలో ఉన్న మూడు కాసుల బంగారపు తాడు, మంగళసూత్రాలను అపహరించుకుపోయారు. ఇదే రోజు రాత్రి కాకినాడ న్యూ రైల్వేపోర్ట్ స్టేష¯ŒSలో రైల్వే రిజర్వేష¯ŒS కౌంటర్ నుంచి బయటకు వస్తున్న యువకుడు భారపు విజయరాఘవేంద్రస్వామి చేతిలోని క్యాష్ బేగ్‌ను వీరు బైక్‌పై వెళుతూ లాక్కొనిపోయారు. రాఘవేంద్రస్వామి తలపై కర్రతో తీవ్రంగా కొట్టి రూ.22 వేలను దొంగిలించుకుపోయారు. లీ బాధితుడు సుమారు ఐదు రోజులపాటు అపస్మారకస్థితిలో ఉన్నాడు. అశోక్‌కుమర్ తన వీధిలోని కొబ్బిరెడ్డి రమణమ్మ ఇంటిని దోచుకునేందుకు పథకం వేశాడు. ఈ చోరీకి గ్యాంగ్ సభ్యులు పైలా మహేష్, డ్రైవర్స్ కాలనీకి చెందిన యాకదేవి సంపత్‌కుమార్, పెట్టా శివసాయి దత్తాలను ఉపయోగించాడు. అక్టోబర్ 14వ తేదీ ఉదయం నడకుదురు, వెలమపేట చివరన ఉన్న కొబ్బిరెడ్డి రమణమ్మ పశువుల పాక వద్ద ఉండగా, నిందితులు ఆటోలో వచ్చి, ఆమె మెడలోని 7 కాసుల బంగారు ఆభరణాన్ని ఎత్తుకుపోయారు. కాకినాడ భానుగుడి సెంటర్లో నివాసం ఉంటోన్న కృష్ణ లాడ్జి యాజమాని కొప్పర్తి రమణమ్మ, ఆనంద్‌కృష్ణ వృద్ధులు. ఆనంద్‌కృష్ణ భానులింగేశ్వరస్వామి గుడికి వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న రమణమ్మ కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కేసి సుమారు 35 కాసుల బంగారు ఆభరణాలు, రూ.60 వేలను దొంగిలించుకుపోయారు. ఇందుకు ప్రధాన సూత్రదారి కాలపురెడ్డి కృష్ణవేణి (ఆనంద్‌కృష్ణ సోదరుడు) కొప్పర్తి తిరుపతమ్మ ఇంట్లో సెప్టెంబర్ 19న జరిగిన దొంగతనంలో కీలక పాత్రధారి. -
ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్
హైదరాబాద్: ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బీహెచ్ఈఎల్లో నివాసం ఉండే పనుగొండ వీణ తన కుమార్తెను తీసుకుని ఈ నెల 4వ తేదీన రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం బీరంగూడ చెక్‌పోస్ట్ కమాన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ముగ్గురూ పటాన్చెరు మండలం కర్దనూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. బీహెచ్ఈఎల్లో చైన్‌స్నాచింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి నుంచి మూడు తులాల బంగారు గొలుసుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కె.భుజంగరావు తెలిపారు. -
మహిళా దొంగ అరెస్ట్
ప్రొద్దుటూరు: స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో మంగళవారం అనుమల శోభ అనే మహిళా దొంగను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.1 లక్షా 92 వేలు విలువ చేసే 95 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను సీఐ ఓబులేసు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 20న ఆటోనగర్ సమీపంలోని ఎఫ్జీ ఫంక్షన్ హాల్లో ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 90 గ్రాముల బంగారు నగలను చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అదే రోజు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే ఈ నెల 15న అన్వర్ థియేటర్ వద్ద ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె బ్యాగులో ఉన్న ఐదు గ్రాముల బంగారు చైన్‌ను అపహరించాడు. ఈ రెండు కేసులకు సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో మంగళవారం ఎర్ర గుంట్ల బైపాస్‌రోడ్డు వద్ద ఉన్న అనుమల శోభ అక్కడికి వచ్చిన పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని బ్యాగును పరిశీలించగా చైను, జుంకీలు, నెక్లెస్, బుట్ట కమ్మలు ఉన్నాయి. బంగారు ఎక్కడిదని ప్రశ్నించగా ఎఫ్జీ ఫంక్షన్‌హాల్‌లోనూ, రెండు రోజుల క్రితం అన్వర్ థియేటర్ వద్ద బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. కడపలోని రామాంజనేయపురానికి చెందిన శోభపై ప్రొద్దుటూరు వన్‌టౌన్, కడప వన్‌టౌన్, బద్వేలులో రెండు కేసులు ఉన్నాయి. ఈమె భర్త, అక్క, బావలు కూడా పాత నేరస్తులని, వారిపై కూడా కేసులున్నట్లు సీఐ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు చలపతి, మహేష్, ఆంజనేయులు, జిఎండి బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘరానా దొంగ అరెస్ట్
హయత్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో ఓ ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి బంగారు ఆభరణాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్ మండలంలోని కందుకూరు గ్రామం వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న మహేష్ అనే దొంగను పోలీసులు అదుపులోకి విచారించారు. ఇళ్లు, మొబైల్, వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి పది తులాల బంగారు ఆభరణాలు, మూడు ఎల్ఈడీ టీవీలు, ఆరు సెల్ఫోన్లు, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
దొరికారు
బెల్లంపల్లి/తాండూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో ‘బొగ్గు దొంగల’ కథనం సంచలనం సృష్టించింది. ఈ దందాపై సాక్షి దినపత్రికలో డిసెంబర్ 27న బొగ్గు దొంగలు.. జనవరి 7న ఆగని దందా.. జనవరి 19న విచారణ బొగ్గేనా? శీర్షికలతో కథనాలు ప్రచురించింది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. బొగ్గు అక్రమ రవాణా కేసు లో 13 మంది నిందితులను గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65.90 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. 15 బొగ్గు టిప్పర్లు(లారీలు), ఇండికా కారును పోలీసులు సీజ్ చేశారు. మరో నాలుగు లారీలను సీజ్ చేయాల్సి ఉంది. 620 ట్రిప్పుల బొగ్గు అక్రమార్గం తాండూర్ మండల కేంద్రంలోని మాదారం ఠాణా ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ కె.ఈశ్వర్రావు వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ఏరియా డోర్లి-2 ఓసీపీ నుంచి నకిలీ వే బిల్లులతో బొగ్గు అక్రమ రవాణాకు కొంత మంది పాల్పడ్డారని తెలిపారు. తొలుత నలుగురు, ఆ తర్వాత మరో ముగ్గురు అక్రమ దందాకు తెరలేపారన్నారు. వీరి తర్వాత మరికొంత మంది లారీ ఓనర్లు ఈ భాగస్వాములయ్యారన్నారు. డోర్లి-2 ఓసీపీ నుంచి 64 ట్రిప్పుల బొగ్గు అక్రమ రవాణా జరి గినట్లు సింగరేణి అధికారులు ఫిర్యాదు చేసినా తమ విచారణలో 620 ట్రిప్పుల బొగ్గు అక్రమ మార్గం పట్టినట్లు తేలిందన్నారు. ఇందులో 500 ట్రిప్పుల బొగ్గు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీకి, మరో 120 ట్రిప్పులు మహా రాష్ట్రలోని వాయునందన పవర్ ప్లాంట్‌కు వెళ్లి నట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. నిందితులు వీరే.. బొగ్గు అక్రమ దందాకు పాల్పడిన వారిలో మిట్టపల్లి శంకర్(నరేశ్‌కుమార్ కోల్ ట్రాన్స్‌పోర్టు మాజీ సూపర్వైజర్), పురంశెట్టి శంకర్, క్యాతం రవికుమార్, కొంతం రమేశ్, పెసరు నరేశ్, కల్వ ల కుమారస్వామి, దాడి శంకర్, గాజుల దేవ య్య, మిల్కూరి సుధాకర్, కటకం రాజేశ్వర్‌రావు, నరేడ్ల జయకృష్ణారెడ్డి(లారీ యజమాను లు), అవదేశ్‌కుమార్‌సింగ్(దేవాపూర్ ఓరి యం ట్ సిమెంట్ ఫ్యాక్టరీ కమర్షియల్ జనరల్ మేనేజర్), గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(మహారాష్ట్ర వా యునందన్ పవర్‌ప్లాంటుకు బొగ్గు అమ్మించే మధ్యవర్తి)లను అరెస్ట్ చేశారు. బొగ్గు అక్రమ దందాకు సంబంధం ఉన్న బడా కాంట్రాక్టర్లు కోనేరు ప్రసాద్‌బాబు, దిలీప్ అగర్వాల్, బొగ్గు అమ్మేందుకు మధ్యవర్తిత్వం చేసిన అగర్వాల్ శ్రీనివాస్, లారీ యజమానులు కాంపెల్లి శ్రీని వాస్‌రెడ్డి, బోయిని రవీందర్, మహారాష్ట్రలోని వాయునందన పవర్‌ప్లాంట్ అధికారులు సత్యనారాయణ, పంకజంతోపాటు మరికొందరు బ డా కోల్ కాంట్రాక్టర్లు, అక్రమార్కులు పరారీలో ఉన్నారు. నిందితులను గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు అజయ్‌బాబు, మోహన్, రాజేందర్, కుమారస్వామి,సంతోష్‌కుమార్‌సింగ్ ఉన్నారు. -
540 గ్రాముల బంగారం స్వాధీనం
మూడు ముఠాలకు చెందిన ఏడుగురు దొంగలను వరంగల్ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.16.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వరంగల్ జిల్లా పోలీసులు వెల్లడించారు.