నిందితురాలి అరెస్టును చూపుతున్న పోలీసులు
హత్నూర(సంగారెడ్డి) : బంగారం దొంగిలించిన కేసులో అంతర్ రాష్ట్ర మహిళా సభ్యురాలిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హత్నూర మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేష్‌నాయక్‌లు వివరాలు వెల్లడించారు. కర్నూల్ జిల్లా బుదారంపేట గ్రామానికి చెందిన అక్షంతల సంధ్య అలియాస్ దివ్య భర్త గణేష్, అలియాస్ రఘుతోపాటు సంధ్యకు సోదరి అయిన జ్యోతి కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కాలనీలో ఈ ఇద్దరు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నారన్నారు.
సోమవారం సంధ్య, జ్యోతి ఇద్దరు కలిసి దౌల్తాబాద్ నుంచి సిరిపుర వెళ్లే ఆటోలో ఎక్కి ఓ వృద్ధురాలి బ్యాగ్‌లో నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించింది. ఈ క్రమంలో దేవులపల్లి బస్టాప్ సమీపంలో పోలీసులు ఆటోను చెక్ చేస్తున్న సమయంలో సంధ్య పట్టుపడినట్లు తెలిపారు. ఈ నెల 24న బోర్పట్ల, కోయూర్‌లో బంగారు ఆభరణాలు చోరీ చేశారని, 28న పటాన్‌చెరు, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23న చోరీలకు పాల్పడినట్లు వీరిపై కేసులు ఉన్నాయన్నారు.
2017లోనూ పటాన్‌చెరులో కేసులు ఉండగా ఇంకా నడుస్తున్నాయన్నారు. 2016 భువనగిరిలో చోరీ కేసు, 2017 కూకట్‌పల్లిలో మూడు కేసులు, 2015 రామచంద్రాపురం, శామీర్‌పేట పోలీస్టేషన్‌లో కూడా బంగారం చోరీ కేసులు సంధ్య, జ్యోతిలపై నమోదైనట్లు తెలిపారు. రాజమండ్రిలో హత్య కేసులో ఈ ఇద్దరు మహిళలు జైలుకు వెళ్లినట్లు సీఐ వివరించారు. కొన్ని సంవత్సరాలుగా బంగారు ఆభరణాలు వేసుకొని బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేసి ఈ ఇద్దరు చోరీలకు పాల్పడుతున్నారని వివరించారు.
నిందితురాలు సంధ్య నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశామని విలేకర్లకు చూపారు. ఇంకా ఐదు తులాల బంగారు ఆభరణాలు జ్యోతి వద్ద ఉన్నాయని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని సీఐ వివరించారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యురాలిని పట్టుకున్నందుకు ఎస్సై రాజేష్‌నాయక్‌ను, సిబ్బందిని అభినందించారు. నిందితురాలిని కోర్టుకు పంపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సైరాజేష్‌నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment