సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమకు అనుకూలంగా ఉన్న వారికి, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు ఉన్న వారిని ఐదేళ్లు దాటినా అదే సబ్ డివిజన్‌లో కొనసాగించగా, కొంతమందిని పక్కనే ఉన్న స్టేషన్లకు బదిలీ చేశారు. మిగిలిన వారిని సబ్ డివిజన్ దాటి వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కొంతమందికి మినహాయింపు ఇవ్వడాన్ని ప్రశ్నించిన 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లను వీఆర్‌లో పెట్టడం వివాదాస్పదంగా మారింది.
జిల్లాలో పోలీసు సిబ్బంది బదిలీల్లో పారదర్శకత కరువైంది. ఓ సబ్‌డివిజన్‌లో ఐదేళ్లు పనిచేసిన సిబ్బందిని మరో సబ్ డివిజన్‌కు బదిలీ చేస్తామని చెప్పినా వాస్తవంలో దానికి భిన్నంగా జరిగింది. రాజకీయ సిఫార్సులు చేయించుకున్న వారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. వారిని పక్కనే ఉన్న సర్కిల్‌కు బదిలీ చేసి సిపార్సులు చేయించుకోలేని వాళ్లని దూర ప్రాంతాల్లోని స్టేషన్లకు బదిలీ చేస్తున్నారంటూ కొంత మంది హెడ్‌కానిస్టేబుళ్లు వ్యతిరేకించినట్లు సమాచారం. నాలుగు రోజుల నుంచి జిల్లాలోని పోలీసు స్టేషన్లలో పనిచేస్తూ ఐదేళ్లు పూర్తి అయిన సిబ్బందికి ఎస్పీ ఎం.రవిప్రకాష్ కౌన్సిలింగ్ చేసి బదిలీలు చేపట్టారు.
అయితే బదిలీలు చేసే ముందు యూనిట్ అధికారి ఇంత వరకు ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టేషన్లలో పనిచేయని వారిని ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టేషన్లకు బదిలీలు చేస్తామని, సిబ్బంది ఏవరూ రాజకీయ నేతలతో ఒత్తిడి తీసుకురావద్దని చెప్పారు. కానీ తాజాగా జరిగిన బదిలీల్లో మొత్తం రాజకీయ, సామాజిక కోణంలో బదిలీలు జరిగాయని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి అనుకొని ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫార్సులతో ఏలూరు నగరంలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్న కొంత మంది సిబ్బందిని ఏలూరు మహిళ పోలీసుస్టేషన్, సీసీఎస్, ఏలూరు రూరల్ స్టేషన్లుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
యూనియన్ నాయకుడు కీలకపాత్ర...
బదిలీల్లో పోలీసు అధికారుల సంఘం నాయకుడు ఒకరు కీలక పాత్ర పోషించారని, తన సామాజిక వర్గానికి చెందిన, తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని కావాల్సిన స్టేషన్‌కు బదిలీ చేయించుకున్నారని ఆ శాఖ సిబ్బంది బహిరంగగానే చెబుతున్నారు. నగరంలోని పోలీసు ఉన్నతాధికారి బంగ్లాకు అనుకొని ఉన్న పోలీసుస్టేషన్‌లో ఏడేళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళ హెడ్‌కానిస్టేబుల్ పేరు బదిలీ జాబితాలో లేకపోవడం చూస్తుంటే బదిలీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో అర్థం అవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
32 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు వీఆర్
రాజకీయ నేతల సిఫార్సులు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో కొంత మంది హెడ్‌కానిస్టేబుళ్లు యూనిట్ అధికారి తీరును తప్పుబట్టారు. దాంతో వారు బదిలీ చేసిన స్టేషన్లకు వెళ్లమని ఖరాకండిగా చెప్పినట్లుగా సమాచారం. ఫలితంగా సుమారు 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లను వీఆర్‌లో పెట్టినట్లుగా తెలిసింది.
మళీ కౌన్సెలింగ్ జరుపుతాం
బదిలీల కౌన్సెలింగ్ అంతా పారదర్శకంగా జరిగింది. ఎవరినీ వీఆర్‌కు పంపలేదు. అందరూ ఒకే స్టేషన్ కోరుకోవడం వల్ల సమస్య వచ్చింది. వారిని పక్కన పెట్టాం. ఒకటి రెండు రోజుల్లో వారికి మళ్లీ కౌన్సెలింగ్ చేసి పోస్టింగులు ఇస్తాం.
ఎం.రవిప్రకాష్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment