పాతపట్నం: జిల్లాలో ఉన్న పలు పోలీస్‌స్టేషన్‌ల ఆధునికీకరణ పనులు చేపడతున్నట్లు రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ డీఈఈ బి.ఎస్.ఎస్.ఆర్.కె.సాయిబాబు తెలిపారు. స్థానిక కోర్టు కూడలిలో పశు వైద్యశాల భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెక్కలి, ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లకు రూ.2.8కోట్లు నిధులు మంజురయ్యాయని, టెక్కలి పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. సోంపేట, రాగోలు, కళింగపట్నం, వీరఘట్టంలో పశువైద్యశాల భవనాలకు రూ.90లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. నరసన్నపేట, రణస్థలంలో రూ.4కోట్ల శాప్ నిధులతో రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని వివరించారు. పాత్రునివలస స్టేడియం పనులకు రూ.6కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు. ఆయనతో పాటు ఏఈ టి.కోదండరామ్ ఉన్నారు.