Fact Check: ‘గోడ’ చాటు కుట్రలు | Fact Check: Behind Demolition of Pathapatnam Sri Neelamani Durga Temple Arch | Sakshi
Sakshi News home page

Fact Check: ‘గోడ’ చాటు కుట్రలు

Published Sun, Oct 24 2021 2:23 PM | Last Updated on Sun, Oct 24 2021 10:40 PM

Fact Check: Behind Demolition of Pathapatnam Sri Neelamani Durga Temple Arch - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల తప్పుడు ప్రచారాలకు తెరతీస్తున్న టీడీపీ నేతలు గోడమీద పిల్లుల్లా వ్యవహరిస్తూ సామాజిక మాధ్యమాల్లో బురద చల్లుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను సైతం వారు వదలడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉదంతమే దీనికి తాజా ఉదాహరణ. రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల కిత్రం తీసుకున్న నిర్ణయం మేరకు స్థానిక నీలమణి దుర్గమ్మ వారి ఆలయ ప్రహరీ గోడ, ఆర్చిని అధికారులు శనివారం స్వల్పంగా తొలగించారు. దీనిపై దుష్ప్రచారం చేస్తూ లోకేష్‌ సహా టీడీపీ నేతలు వైషమ్యాలను రగిల్చేందుకు సోషల్‌ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టారు. 

(చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు)

ధ్వజస్థంభం, మండపానికి నష్టం వాటిల్లకుండా.. 
వాస్తవానికి భూ సమీకరణ ప్రక్రియలో భాగంగా ఆలయ ధ్వజ స్థంభం, మండపం లాంటివి సైతం తొలగించాల్సి ఉంది. ప్రస్తుతం 30 సెంట్ల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం ఉండగా తొమ్మిది సెంట్ల మేర సమీకరణలో పోవాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నీలమణి దుర్గమ్మవారి ఆలయం ధ్వజస్థంభం, మండపం లాంటి వాటికి నష్టం వాటిల్లకుండా స్థానిక ఎమ్మెల్యే ఆరేడు నెలలుగా అధికారులతో పలు సంప్రందింపులు జరిపినట్లు దేవదాయ శాఖ వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌ ప్రక్కగా నిర్మించాల్సిన అప్రోచ్‌ రోడ్డు డిజైను మార్చేందుకు సైతం స్థానిక ఎమ్మెల్యే కేంద్ర అధికారులను సైతం ఒప్పించారు.

(చదవండి: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు)

దీంతో కేవలం ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం అర్చిని రెండు అడుగుల మేర తొలగించేందుకు మాత్రమే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది సెంట్లకు బదులుగా ఇప్పుడు కేవలం అర సెంటు ఆలయ భూమిని మాత్రమే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. తొలగించిన గోడ స్థానంలో కేవలం మూడు అడుగులు మాత్రమే ఆలయం లోపలికి జరిపి కొత్తగా ప్రహారీ గోడ, ముఖ ద్వారం ఆర్చిని సంబంధిత కాంట్రాక్టరు ఆధ్వర్యంలోనే నిర్మించేలా ఒప్పందం జరిగింది. 

భూ సమీకరణ పరిహారం రూ.1.40 కోట్లు
రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం 2019 ఆగస్టు 28వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్‌ ప్రకారం గతేడాది అక్టోబరులో ఆలయానికి రూ. 1,40,57,404 పరిహారాన్ని మంజూరు చేశారు. జిల్లా స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్, స్థానిక తహసీల్దార్, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈనెల 22వ తేదీన ఆలయాన్ని సందర్శించి ఎక్కువ నష్టం వాటిల్లకుండా తొలగింపులు పూర్తయ్యేలా మార్కింగ్‌లు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక తహసీల్దార్, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్, ఆర్‌ అండ్‌ బీ డీఈఈ, సమక్షంలో తొలగింపు ప్రక్రియ చేపట్టారు.

దసరా ఉత్సవాల కోసం వాయిదా
ఫ్ల్రై ఓవర్‌ నిర్మాణంలో భాగంగా మూడు నెలల కిత్రమే ప్రహారీ గోడ తొలగింపు చేపట్టాలని కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఆలయంలో దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు వాయిదా వేసినట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయంలో దసరా ఉత్సవాల పూర్తయిన తర్వాతే తొలగింపు పనులు చేపట్టామని, వెంటనే కొత్త ప్రహారీ గోడ, ఆర్చి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్టు వివరించారు. 

బూతులు బెడిసికొట్టడంతో..
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో బూతులు మాట్లాడించి ప్రజల మధ్య వైషమ్యాలను రగిల్చే ఎత్తుగడ బెడిసికొట్టడంతో తాజా ఘటనను ఆ పార్టీ నేతలు ఎంచుకున్నారు. ‘రెండున్నరేళ్ల పాలనలో హిందూధర్మం మంటగలిసింది. దేవుళ్లకి తీరని అపచారం తలపెట్టారు’ అంటూ లోకేష్‌ మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు.

ఫ్యాక్ట్‌ చెక్‌తో వాస్తవాలు వెలుగులోకి..
ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా ప్రభుత్వం బయటపెట్టింది. టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా పోస్టులతో పాటు స్థానిక ఆలయ ఈవో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను జతపరిచి ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ప్రభుత్వం మీడియాకు వాస్తవాలను వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement