‘మీకు.. దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి.’ అని ఒకరు.. ‘మీ వద్ద లాఠీలు ఉంటే.. మా వద్ద కట్టెలు ఉన్నాయి. పది నిమిషాలు సమయం ఇస్తున్నాం! ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు.’ అని మరొకరు.. ఇవే కాదు పత్రికల్లో రాయలేని దుర్భాషలు. ఏకంగా సీఐ ఛాంబర్‌లోకి వచ్చి అధికార పార్టీనేతలు సీఐని బెదిరిస్తే, దారుణంగా దూషిస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు. ఇంత జరిగినా పోలీసులు ఎందుకు మౌనం దాల్చారనుకుంటున్నారా? ఎందుకంటే.. ఆ నేత ఊరు తాడిపత్రి. అదొక ప్రత్యేక సామ్రాజ్యం కాబట్టి. అక్కడ రెండే మాటలు. జీ హుజూర్ అనడమా? పెట్టేబేడ సర్దుకుని వెళ్లిపోవడమా? ఇంతటి అరాచక పరిస్థితుల్లో పోలీసుల మాటకు.. చేతలకు ‘పవర్’ ఉంటుందనుకోవడం పొరపాటే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అనంతపురం కార్పొరేషన్ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించలేదని మేయర్ స్వరూప విమర్శించారు. దీనిపై జేసీ అనుచరుడు శివనాయుడు అనే వ్యక్తి మేయర్‌కు, ఆయన భర్త వెంకటేశ్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేసి దుర్భాషలాడారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు గత నెల 21న తాడిపత్రి పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. జేసీ పీఏ, రవీంద్రారెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ జిలాన్‌తో పాటు భారీ సంఖ్యలో స్టేషన్‌కు వెళ్లారు. తమ అనుచరున్ని ఎలా అదుపులోకి తీసుకుంటారని, గతంలో తాము ఫిర్యాదు చేసిన వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని పోలీసులపై మాటల దాడి చేశారు.
వారంతా తీవ్రంగా స్పందిస్తుంటే సీఐ, ఎస్‌ఐతో పాటు పోలీసులు సమాధానం చెప్పలేక మౌనంగా నిల్చుండిపోయారు. పోలీసుల మౌనాన్ని మరింత అలుసుగా తీసుకున్న జిలాన్ దుర్భాషలకు దిగారు. ఎమ్మెల్యే వస్తే పరిస్థితి చేదాటిపోతుంది.. 10నిమిషాలే సమయం ఇస్తున్నామని జేసీ పీఏ రవీంద్రారెడ్డి పోలీసులకు గడువు విధించే పరిస్థితి. సీఐ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని సీఐతో పాటు పోలీసు వ్యవస్థపైనా బూతుల వర్షం కురిసింది. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డు అయింది. జేసీ అనుచుల స్థానంలో మరొకరు ఉంటే పోలీసులు లాఠీచార్జి చేసి, వారిపై కేసులు నమోదు చేసి నానా బీభత్సం సృష్టించేవారు. కానీ జేసీ అనుచరులు కావడంతో నిమ్మకుండిపోవడం గమనార్హం.
తాడిపత్రిలో ఏ అధికారి వచ్చినా భయభ్రాంతులకు గురిచేసి తమ దారికి తెచ్చుకోవడం అక్కడి నేతల నైజం. గతంలో ఓ బ్యాంకు అధికారిణిపై కూడా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆమె సెలవులో వెళ్లిపోయారు. గుత్తి మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి గ్రానైట్ మాఫియాకు అడ్డుగా నిలబడి కొరకరాని కొయ్యగా మారడంతో ఆయన్ను బదిలీ చేయించారు. ఇప్పడు భాస్కర్‌రెడ్డి అనే సీఐపై దుర్భాషలాడారు. తాడిపత్రిలోని అరాచకాలపై పత్రికల్లో కథనాలు రాస్తే విలేకరులను సైతం బెదిరించడం, భౌతికదాడులకు తెగబడటం పరిపాటిగా మారింది. గతంలో ‘సాక్షి’ విలేకరి రాజశేఖర్‌ను తాడిపత్రిలో సజీవదహనానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ సీనియర్ విలేకరిని పిలిపించి మందలిస్తే ఆయన పత్రికలో మానేశారు. ఇప్పుడు రవికుమార్ అనే మరో విలేకరిపై కొందరు భౌతికదాడికి తెగబడ్డారు. ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా ఇక్కడ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది.
ఇక్కడికి వచ్చేందుకు అధికారులు విముఖత చూపుతున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇలా అధికార వర్గాలను గుప్పిట్లో పెట్టుకుని, తాడిపత్రిలో తమ దారికి రాని వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టడం ఇక్కడి నేతలు చేసే రాజకీయం. ఉన్నతాధికారులు కూడా అక్కడి నేతలు సిఫార్సుల మేరకు తమ సిబ్బందిని నడిపించడం మినహా స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. తాజాగా పోలీసులపైనే దుర్భాషలాడినా ఎలాంటి చర్యలు లేవంటే.. జిల్లాలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. ఉన్నతాధికారులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది.
పోలీసులకు భరోసా లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి?
స్టేషన్‌పైకి వచ్చి ఓ సీఐని దుర్భాషలాడి పదిరోజులు గడుస్తున్నా ఎస్పీ జోక్యం చేసుకుని కేసు నమోదు చేయలేదంటే జిల్లాలో పోలీసులు ఎంత నిస్సహాయులుగా ఉన్నారో ఇట్టే తెలుస్తోంది. సీఐల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటని చాలామంది ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఉన్నతాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. డీఎస్పీలు, ఐపీఎస్ అధికారులు సీఐకి అండగా నిలవలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment