ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న విద్యార్థినులు
♦ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకి విజ్ఞప్తి చేసిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు
కొమరోలు : ఇప్పటి వరకూ తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలి వివాహాన్ని అడ్డుకోవాలని తొమ్మిదో తరగతి విద్యార్థినులు మూకుమ్మడిగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకి విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మండల కేంద్రం కొమరోలులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికంగా నివాసం ఉండే 15 ఏళ్ల బాలిక మదర్సాలో 8వ తరగతి పూర్తి చేసుకుని ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.బాలికను తల్లిదండ్రులు ఒంగోలు తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారంటూ ఆమె క్లాస్‌మేట్స్‌కు సమాచారం అందింది. విద్యార్థినులంతా ఒక్కటై అందరూ కలిసి స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.
ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే సదరు బాలిక తండ్రిని పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. బాలిక తండ్రి పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తెను ఒంగోలులోని మదర్సాలో చేర్పిస్తున్నానని, వివాహం చేయడం లేదని వివరణ ఇచ్చాడు. బాధిత విద్యార్థిని తనకు ఒంగోలు వెళ్లడం ఇష్టం లేదని చెప్పడంతో కొమరోలులోనే చదవించాలని తండ్రికి ఎస్‌ఐ సూచించారు. చిన్న వయసులో వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.