
తణుకు అర్బన్ : తణుకు సర్కిల్ పోలీస్ స్టేషన్.. సస్పెన్షన్ల సర్కిల్‌గా పోలీస్ వర్గాల్లో పేరుగాంచింది. పోలీస్ అధికారులు ఇక్కడకు వచ్చేటప్పుడు ఎంత హుషారుగా వస్తారో ఆ తర్వాత ఏదో ఒక వివాదం చుట్టుముట్టుకుని వెళ్లేటప్పుడు వివాదాస్పదంగా బయటకు వెళుతుంటారు. గత కొన్నేళ్లుగా వరుసగా అధికారులు సస్పెండ్ అయి వెళ్లడమే ఇందుకు కారణం. ఇక్కడ పనిచేసిన సీఐలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని మరీ వచ్చిన వారే అత్యధికం. తీరా ఇక్కడకు వచ్చాక ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం సస్పెండ్ కావడం పరిపాటిగా మారింది. దీంతో ఇప్పుడు తణుకు సర్కిల్ అంటే అధికారులు భయపడుతున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో నలుగురు అధికారులు సస్పెండ్ అయి వెళ్లగా తాజాగా ఈ నెల 31న తణుకు సీఐ చింతా రాంబాబు బదిలీపై వీఆర్‌కు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈయన ఇక్కడ రెండేళ్లు ఉద్యోVýæ జీవితం పూర్తి చేసుకున్నారు.
ఆర్థికంగా బలమైన సర్కిల్
జిల్లాలో ఎక్కువ క్రైమ్ రికార్డు ఉండడంతో పాటు ఆర్థిక వనరులు కూడా బలంగా ఉండడం తణుకు సర్కిల్ స్టేషన్ ప్రత్యేకత. పట్టణం వ్యాపార, వాణిజ్య రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతుండడం కూడా ఇందుకు కారణం. దీంతో తణుకు వచ్చేందుకు అధికారులు ఉత్సాహం చూపించేవారు. తణుకు సర్కిల్ కార్యాలయానికి సంబంధించి తణుకు, తణుకు, రూరల్, తణుకు ట్రాఫిక్, ఉండ్రాజవరం, పెరవలి, అత్తిలి స్టేషన్‌లు ఉన్నాయి.
2009 నుంచి అధికారులకు ఎదురుదెబ్బలే
2009 నుంచి పనిచేసిన సర్కిల్ అధికారుల్లో ఒక్కరు తప్ప మిగిలినవారంతా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని సస్పెండ్ అయి వెళ్లినవారే. 2011, 2012, 2014, 2016 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసిన సీఐలు వివిధ వివాదాల్లో ఇరుక్కుని సస్పెండ్ అయ్యారు. 2013లో తణుకు సర్కిల్ అధికారిగా వచ్చిన జి.మధుబాబు ఒక్కరే బదిలీపై వెళ్లారు. తాజాగా తణుకు సీఐ చింతా రాంబాబు కూడా ఇటీవల కాలంలో ఇటు రాజకీయం గానూ అటు డిపార్ట్‌మెంట్‌లోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో దళితవర్గాల మధ్య ఏర్పడిన తగాదాలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సీఐ పాత్రపై రాజకీయంగా గుర్రుగా ఉన్నా అధికారిని బదిలీ చేయిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో వేటు పడలేదు. మరోవైపు ఆయన వ్యవహార శైలిపై స్వయంగా పోలీస్ సిబ్బందే ఉన్నతాధికారికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను వీఆర్‌లో ఉంచారు. రెండేళ్లు పదవీకాలం పూర్తికావడం కూడా ఆయన బదిలీకి కారణంగా కనిపిస్తోంది.
స్టేషన్‌కు వాస్తు దోషం
సర్కిల్ అధికారులంతా వరుసగా సస్పెండ్ అవుతున్నారనే ఉద్ధేశంతో గతంలో నెమ్మదస్తుడు, అందరివాడని ముద్రపడిన ఒక అధికారిని ఇక్కడకు బదిలీ చేశారు. ఆయన వచ్చిన తర్వాత తణుకు సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎదురుగా ఉన్న సిగ్నల్ టవర్‌ను వాస్తు దోషానికి మూలంగా ఉందని పెద్ద మొత్తం వెచ్చించి మరీ స్టేషన్ వెనుక వైపునకు మార్పించారు. కానీ తరువాత వచ్చిన ఇద్దరు అధికారులు కూడా తిరిగి ఇక్కడ నుంచి సస్పెండ్ అయి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ వాస్తుదోషంపై గుసగుసలాడుకుంటున్నారు.